
ఏఐ సమ్మిట్ ఎక్స్‌పో స్టాల్ ఖాళీ చేయండి..‘గాల్గోషియస్’కు ప్రభుత్వ ఆదేశం
ఏఐ సమ్మిట్ ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన తమ స్టాల్‌ను తక్షణమే ఖాళీ చేయాలని గాల్గోషియస్ యూనివర్సిటీకి నిర్వాహకులు ఆదేశించినట్లు సమాచారం. ఎక్స్‌పోలో ప్రదర్శించిన రోబోటిక్ కుక్క మూలం, సాంకేతిక స్వామ్యంపై వివాదం చెలరేగడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఎక్స్‌పోలో ‘ఓరియన్’ పేరుతో ప్రదర్శించిన రోబోటిక్ డాగ్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అది విశ్వవిద్యాలయం స్వయంగా అభివృద్ధి చేసిన ఆవిష్కరణ కాదని, చైనా తయారీ అయిన ‘యూనిట్రీ గో2’ మోడల్‌ను ప్రదర్శించారని నెటిజన్లు ఆరోపించారు.వివాదం ముదిరిన నేపథ్యంలో ఎక్స్‌పో ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని విశ్వవిద్యాలయ సిబ్బందికి ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బుధవారం ఎక్స్‌పో ప్రదేశంలో విశ్వవిద్యాలయ స్టాల్ వద్ద ఎలాంటి ప్రదర్శన కనిపించలేదు.
విమర్శల నేపథ్యంలో విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. ‘విద్యార్థులకు ఏఐ ప్రోగ్రామింగ్ నేర్పించి, ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న సాధనాలు, వనరులను ఉపయోగించి ప్రాక్టికల్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం మా లక్ష్యం’ అని పేర్కొంది. ఏఐ రంగంలో ప్రతిభను తీర్చిదిద్దడం సమయావసరమని తెలిపింది. తమపై జరుగుతున్న ప్రతికూల ప్రచారం వల్ల అధ్యాపకులు, విద్యార్థులు మానసికంగా బాధపడుతున్నారని, ఆధునిక సాంకేతికతలతో విద్యార్థులకు ప్రాయోగిక అనుభవం కల్పించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. ప్రపంచ సాంకేతిక వేదికలను ఉపయోగించి విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని పేర్కొంది. ఈ వివాదంపై స్పందించిన విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ నేహా సింగ్ మాట్లాడుతూ రోబో కుక్కను మేమే తయారు చేశామని మేమెప్పుడూ చెప్పలేదు. విద్యార్థులకు ప్రేరణ కలిగించేందుకు మాత్రమే పరిచయం చేశాం. భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దడంలో ఏఐ సాంకేతికతల వినియోగం కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఎక్స్‌పో ప్రాంతాన్ని ఖాళీ చేయమని ఆదేశించిందన్న వార్తలపై ఆమె స్పందిస్తూ దానిపై నాకు సమాచారం లేదు. ప్రస్తుతం మేమంతా ఇక్కడే ఉన్నామని పేర్కొన్నారు.
‘మేం అభివృద్ధి చేయలేదు… విద్యార్థుల పరిశోధన కోసం కొనుగోలు చేశాం’ – గాల్గోషియస్ యూనివర్సిటీ వివరణ
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రదర్శించిన ‘చైనా’ రోబోటిక్ డాగ్ వివాదంపై గాల్గోషియస్ రిజిస్ట్రార్ నితిన్ కుమార్ గౌర్ బుధవారం వివరణ ఇచ్చారు. ‘డెవలప్’ (అభివృద్ధి చేయడం), ‘డెవలప్‌మెంట్’ (అభివృద్ధి ప్రక్రియ) అనే పదాల వాడకంలో గందరగోళం వల్లే అపార్థం ఏర్పడిందని ఆయన తెలిపారు. విశ్వవిద్యాలయం ఆ రోబోను స్వయంగా తయారు చేయలేదని, కానీ విద్యార్థుల అకాడెమిక్, పరిశోధన అవసరాల కోసం దానిపై అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. మేము దాన్ని తయారు చేయలేదు. విద్యార్థులు పరిశోధన చేయడానికి రోబోను కొనుగోలు చేశాం. విద్యార్థులు ప్రాక్టికల్‌గా నేర్చుకునేలా చేయడమే మా లక్ష్యమని గౌర్ పేర్కొన్నారు.
ఏఐ ఎక్స్‌పోలో ప్రొఫెసర్ నేహా సింగ్ ‘ఓరియన్’ పేరుతో రోబోడాగ్‌ను పరిచయం చేసిన వైరల్ వీడియోపై స్పందిస్తూ, ఆ సందర్భంలో పదాల వాడకంలో అపార్థం జరిగి ఉండవచ్చని తెలిపారు. ఎక్స్‌పో ఖాళీ చేయమన్న అధికారిక సమాచారం నాకు అందలేదని చెప్పారు.
ఏఐ సమ్మిట్‌పై రాహుల్ గాంధీ విమర్శలు
బుధవారం ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో చైనా తయారీ రోబోటిక్ కుక్కను స్వంత ఆవిష్కరణగా ప్రదర్శించారనే ఆరోపణల నేపథ్యంలో రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమాన్ని ‘అవ్యవస్థిత పీఆర్ ప్రదర్శన’(గందరగోళంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమం)గా అభివర్ణించారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో కాంగ్రెస్ పార్టీ పోస్టుకు ఆయన స్పందిస్తూ భారత ప్రతిభను, డేటాను వినియోగించుకోవాల్సిన సమయంలో ఏఐ సమ్మిట్ అవ్యవస్థిత పీఆర్ ప్రదర్శనగా మారింది. భారత డేటా అమ్మకానికి ఉంచి, చైనా ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. గాల్గోషియస్ యూనివర్సిటీ ఎక్స్‌పోలో చైనా తయారీ రోబోటిక్ డాగ్‌ను తమ ఆవిష్కరణగా చూపించిందన్న ఆరోపణలతో వివాదం చెలరేగింది.
