
ఏఐ సమ్మిట్‌లో బిల్‌గేట్స్‌కు నో స్పీచ్
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఇవ్వాల్సిన కీలక ప్రసంగాన్ని బిల్ గేట్స్ ఇవ్వడం లేదని ఆయన ఫౌండేషన్ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఫౌండేషన్ అధికారికంగా కారణాలు వెల్లడించకపోయినా, మరణించిన లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్ కు సంబంధించిన పత్రాల్లో గేట్స్ పేరు ప్రస్తావనకు రావడంతో, ఆయనకు వేదికపై స్థానం కల్పించేందుకు నిర్వాహకులు అయిష్టత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 17న కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఎప్స్టీన్ వ్యవహారం బయటపడకముందే సమ్మిట్‌కు రావాలని గేట్స్‌కు ఆహ్వానం పంపినా, ఆ తర్వాత ఆహ్వానాన్ని ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నాయి. ఫిబ్రవరి 16న ప్రారంభమైన ఈ ఐదు రోజుల సదస్సులో ఆయన పాల్గొనరని కూడా తెలిపాయి. అయితే అదే రోజు గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి ఒకరు ఆయన సమ్మిట్‌లో పాల్గొంటారని స్పష్టం చేశారు. తాజాగా గురువారం విడుదల చేసిన ప్రకటనలో సమ్మిట్ ముఖ్య లక్ష్యాలపై దృష్టి కేంద్రీకృతం కావాలనే ఉద్దేశంతో మిస్టర్ గేట్స్ తన కీలక ప్రసంగాన్ని ఇవ్వడం లేదని ఫౌండేషన్ వెల్లడించింది.
ఆఫ్రికా, ఇండియా కార్యాలయాల అధ్యక్షుడు అంకుర్ వోరా ఈ రోజు సమ్మిట్‌లో మాట్లాడతారని ఫౌండేషన్ ఎక్స్ వేదికగా తెలిపింది. భారత్‌లో ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యాల సాధనలో తమ విధానాలు యథాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. సమ్మిట్ అధికారిక వెబ్‌సైట్‌లో టెక్ దిగ్గజాలు, పరిశ్రమ నాయకులు, విధాన రూపకర్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, టెక్నాలజిస్టుల జాబితాలో గేట్స్ పేరు కూడా ఉండేది. ఫిబ్రవరి 19న భారత్ మండపంలో జరిగే ప్రధాన సెషన్‌లో 12 నిమిషాల ప్రసంగానికి ఆయనకు సమయం కేటాయించారు. అయితే మంగళవారం ఉదయం కీలక సదస్సులో పాల్గొనేవారి జాబితా నుంచి ఆయన పేరు తొలగించింది.
అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన పత్రాల్లో ఎప్స్టీన్ చేసిన ఒక ఆరోపణలో గేట్స్‌కు లైంగిక వ్యాధి సోకిందని ప్రస్తావన ఉన్నప్పటికీ, ఎప్స్టీన్ బాధితుల్లో ఎవరూ గేట్స్‌పై తప్పు ఆరోపణలు చేయలేదు. గేట్స్ ప్రతినిధి ఆ ఆరోపణను పూర్తిగా అసంబద్ధమైనదిగా ఖండించారు. గేట్స్ తన పర్యటనలో భాగంగా సోమవారం భారత్‌కు చేరుకుని, ఆయన తొలి పర్యటనగా విజయవాడకు వెళ్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్, ఇతర రాష్ట్ర అధికారులతో సమావేశమయ్యారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, కె. అచ్చన్నాయుడు, వై. సత్యకుమార్ తదితరులు ఆయనకు స్వాగతం పలికిన విషయం పాఠకులకు విదితమే.
