Let's talk: editor@tmv.in
ఏఐ సమ్మిట్‌లో గందరగోళం

ఏఐ సమ్మిట్‌లో గందరగోళం

Pinjari Chand
18 ఫిబ్రవరి, 2026

ప్రపంచంలో అతిపెద్ద కృత్రిమ మేధస్సు సదస్సుగా ప్రచారం పొందుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్–2026లో తొలి రోజు ఏర్పడిన గందరగోళంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ క్షమాపణ తెలిపారు. ప్రజలు భారీగా హాజరు కావడంతో కొన్ని లోపాలు చోటుచేసుకున్నాయని, ఇకపై నిర్వహణ మరింత సజావుగా చేస్తామని హామీ ఇచ్చారు.

భారత్ మండపంలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సమ్మిట్. స్పందన అద్భుతంగా ఉంది. ఎవరికైనా ఇబ్బందులు కలిగితే క్షమించాలి. ప్రస్తుతం వ్యవస్థను మరింత సవ్యంగా మార్చాం అన్నారు. సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ‘వార్ రూమ్’ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మొదటి రోజు 70,000 మందికి పైగా హాజరైనట్టు వెల్లడించారు. అయితే భారీ రద్దీ కారణంగా పొడవైన క్యూలు, భద్రతా తనిఖీల్లో గందరగోళం, స్టాళ్లను తాత్కాలికంగా ఖాళీ చేయించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎక్స్‌పో సందర్శనకు ముందు కొన్ని స్టాళ్లను ఖాళీ చేయించడంతో ఇబ్బందులు పెరిగినట్టు నిర్వాహకులు తెలిపారు.

వేరబుల్స్ మాయం, నిర్వాహణపై ప్రశ్నలు

కొంతమంది ఎగ్జిబిటర్లు తమ వస్తువులు మిస్సయ్యాయని ఆరోపించారు. నియో సాపియన్ సంస్థ ప్రతినిధులు భద్రతా సూచనలతో స్టాల్ విడిచివెళ్లిన తర్వాత ఏఐ వేరబుల్స్ మాయమైనట్టు పేర్కొన్నారు. నీరు, ఆహారం వంటి ప్రాథమిక సదుపాయాల లోపం, రిజిస్ట్రేషన్ గందరగోళం, వై-ఫై సమస్యలు కూడా తలెత్తాయి. అయితే నిర్వాహకులు ఇబ్బందులు తొలగించేందుకు రోజంతా చర్యలు చేపట్టామని, మిగిలిన రోజుల్లో సమన్వయం మెరుగుపడుతుందని తెలిపారు.

కొత్త తరానికి ఏఐ విద్య అందించడం మన బాధ్యత: ప్రదాన్

ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మాట్లాడుతూ, యువతకు ఏఐ ఆధారిత విద్య అందించడం జాతీయ ప్రాధాన్యతగా మారిందన్నారు. భారత కొత్త తరానికి ఏఐ-ఎనేబుల్డ్ విద్య అందించడం మన బాధ్యత. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాలలను సాంకేతికంగా బలోపేతం చేయడంలో ఏఐ కీలకమని చెప్పారు.

200 బిలియన్ పెట్టుబడుల అంచనా

వచ్చే రెండేళ్లలో భారత్‌లో 200 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. డీప్ టెక్ స్టార్టప్‌లు, మౌలిక వసతులు, జనాభా స్థాయిలో అమలు చేయగలిగే పరిష్కారాలపై గ్లోబల్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. సమ్మిట్‌కు 3 లక్షలకుపైగా యువత, పరిశోధకులు నమోదు చేసుకున్నారని, అన్ని సెషన్లు హౌస్‌ఫుల్‌గా సాగుతున్నాయని ఆయన వెల్లడించారు. సాంకేతికత వల్ల కలిగే చెడును నియంత్రిస్తూ, ప్రయోజనాలను విస్తరించాలని సూచించారు.

సమ్మిట్ నిర్వహణపై ఖర్గే విమర్శలు

ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖర్జున్ ఖర్గే సమ్మిట్ నిర్వహణపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమం పూర్తి గందరగోళంగా మారిందని ఆరోపించారు.ఎగ్జిబిటర్లు, సందర్శకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆహారం-నీరు లేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొలి రోజు ఫోటో సెషన్ కోసం రావడంతో మరింత అంతరాయం కలిగిందని విమర్శించారు. ఇలాంటి పెద్ద స్థాయి టెక్ సదస్సులను సజావుగా నిర్వహించే విషయంలో ప్రతి సంవత్సరం జరిగే బెంగుళూర్ టెక్ సమ్మిట్ నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. మొత్తానికి, భారీ అంచనాల మధ్య ప్రారంభమైన ఈ ఏఐ సమ్మిట్ తొలి రోజు గందరగోళం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒకవైపు కేంద్రం క్షమాపణలు తెలుపుతూ సవరించిన చర్యలను ప్రకటిస్తుండగా, మరోవైపు ప్రతిపక్షం నిర్వహణ వైఫల్యాలపై విమర్శలు ఎక్కుపెట్టింది.