
ఏఐ రంగంలో గ్లోబల్ పవర్‌హౌస్‌గా భారత్: ఘనంగా ముగిసిన 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'
భారతదేశం తన భారీ స్థాయి, ప్రతిభావంతులైన మానవ వనరులు, డిజిటల్ మౌలిక సదుపాయాల కారణంగా ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉందని ప్రపంచంలోని అగ్రగామి టెక్నాలజీ సంస్థల అధినేతలు పునరుద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంలో భారతదేశం అగ్రగామిగా నిలవబోతోందని టెక్ దిగ్గజాలు స్పష్టం చేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026' వేదికగా భారత ప్రతిభను ప్రపంచం కొనియాడింది.
భారతదేశంలోని భారీ స్థాయి మార్కెట్, అపారమైన మేధస్సు, డిజిటల్ మౌలిక సదుపాయాలు భారత్‌ను ప్రపంచ ఏఐ ఇంజిన్‌గా మారుస్తున్నాయని పరిశ్రమల అధినేతలు అభిప్రాయపడ్డారు. ఇది కేవలం సాఫ్ట్‌వేర్ సేవలకే పరిమితం కాకుండా, ఏఐ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తుందని వారు బలంగా చెప్పారు.
ఓపెన్ ఏఐ మెటా ప్రశంసలు:
ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మాన్ మాట్లాడుతూ, "పూర్తిస్థాయి ఏఐ లీడర్‌గా ఎదగడానికి అవసరమైన అన్ని అంశాలు భారత్ వద్ద ఉన్నాయి" అని కొనియాడారు. మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ అలెగ్జాండర్ వాంగ్ కూడా భారత్ తమకు అత్యంత కీలకమైన దేశమని, ఇక్కడ సూపర్ ఇంటెలిజెన్స్‌ను వేగంగా విస్తరించవచ్చని తెలిపారు.
గూగుల్, మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం:
భారత్ అసాధారణ వృద్ధి పథంలో ఉందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. గూగుల్ ఇప్పటికే విశాఖపట్నంలో డేటా సెంటర్ వంటి మౌలిక వసతులపై దృష్టి పెట్టింది. అలాగే, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ గ్లోబల్ సౌత్ దేశాలకు ఏఐని చేరవేయడంలో భారత్ పాత్ర కీలకమని పేర్కొన్నారు.
అక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్ ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే విద్యలో ఏఐIని చేర్చడాన్ని ప్రశంసించగా, బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా హెల్త్ డేటా వినియోగంలో భారత్ ప్రపంచానికే రోల్ మోడల్ అని తెలిపారు.
ఈ సదస్సులో మైక్రోసాఫ్ట్ రూ. 4.5 లక్షల కోట్లు, క్వాల్‌కామ్ రూ. 1,360 కోట్ల పెట్టుబడులను ప్రకటించాయి. అలాగే ఎన్వీడియా దేశీయ క్లౌడ్ కంపెనీలతో కలిసి గిగావాట్-స్కేల్ ఏఐ ఫ్యాక్టరీల నిర్మాణానికి ముందుకు రావడం విశేషం.
"సర్వజన హితాయ, సర్వజన సుఖాయ" అనే నినాదంతో సామాన్యుడి జీవితాల్లో మార్పు తేవడమే లక్ష్యంగా ఈ సదస్సు సాగింది. యూపీఐ తరహాలోనే ఓపెన్ నెట్‌వర్క్స్ ద్వారా ఏఐని సామాన్యులకు అందుబాటులోకి తేవాలని నందన్ నీలేకని సూచించారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకగా భారత్ ఈ సదస్సును నిర్వహించింది. కేవలం నియంత్రణలకే పరిమితం కాకుండా, అభివృద్ధికి ఏఐని ఎలా వాడుకోవాలో ప్రపంచానికి దిశానిర్దేశం చేసింది.
సాంకేతికతతో పాటు ఎదురయ్యే డీప్ ఫేక్, ఆన్‌లైన్ మోసాలు, డేటా భద్రత వంటి అంశాలపై కూడా చర్చలు జరిగాయి. వీటిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి.
ఢిల్లీ డిక్లరేషన్:
ఐదు రోజుల పాటు జరిగిన ఈ సదస్సు 'ఢిల్లీ డిక్లరేషన్'తో ముగిసింది. సుమారు 80కి పైగా దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేశాయి. ఏఐ ప్రయోజనాలు మానవాళి అందరికీ సమానంగా అందాలనేది ఈ డిక్లరేషన్ ప్రధాన ఉద్దేశ్యం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ఈ సదస్సు ఘన విజయం సాధించిందని, భారత్ పాత్రపై ప్రపంచానికి నమ్మకం కలిగిందని తెలిపారు.
సమ్మిట్ ముగింపులో రూ. 21 లక్షల కోట్లకు పైగా మౌలిక సదుపాయాల హామీలు, 20 బిలియన్ డాలర్ల డీప్-టెక్ పెట్టుబడులు వచ్చాయి. 20కి పైగా దేశాధినేతలు, 5 లక్షల మందికి పైగా సందర్శకులు పాల్గొన్న ఈ సదస్సు, భారత్‌ను గ్లోబల్ ఏఐ హబ్‌గా మార్చడంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.
అంతకుముందు, ఈ ఏఐ సమ్మిట్‌లో ప్రధాని మోడీ ఏఐ కోసం 'MANAV' (మానవ్) అనే ఐదు సూత్రాల దార్శనికతను ప్రపంచానికి పరిచయం చేశారు. నైతిక విలువలు, జవాబుదారీతనం, జాతీయ సార్వభౌమాధికారం, అందరికీ అందుబాటులో ఉండటం, ప్రామాణికత అనే అంశాలతో కూడిన ఈ విజన్ ద్వారా ఏఐ అభివృద్ధిలో మనిషికి ప్రాధాన్యత ఉండాలని ఆయన స్పష్టం చేశారు. "ఏఐ ని ఆకాశమంత ఎత్తుకు ఎదగనివ్వాలి, కానీ దాని కంట్రోల్ మాత్రం ఎప్పుడూ మనిషి చేతుల్లోనే ఉండాలి" అని ఆయన గట్టిగా చెప్పారు.
సాంకేతికతతో వచ్చే ముప్పులను ప్రధాని హెచ్చరిస్తూ, ముఖ్యంగా డీప్ ఫేక్స్ వంటి తప్పుడు కంటెంట్‌ను అరికట్టాలని సూచించారు. ఆహార పదార్థాలపై 'న్యూట్రిషన్ లేబుల్స్' ఉన్నట్లే, డిజిటల్ కంటెంట్‌పై కూడా అది ఏఐతో తయారైందా లేదా అని తెలిపే 'ఆథెంటిసిటీ లేబుల్స్' తప్పనిసరి చేయాలని ప్రతిపాదించారు. ముఖ్యంగా పిల్లల భద్రతకు సంబంధించి ఏఐ నియమాలు చాలా కఠినంగా ఉండాలని, బాధ్యతారహితమైన సాంకేతికత సమాజానికి ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.
సమ్మిళిత వృద్ధి, గ్లోబల్ లీడర్ షిప్
సాంకేతికత అందరికీ సమానంగా అందాలన్న ఉద్దేశంతో, మోదీ తన ప్రసంగాన్ని ఏఐ ద్వారా రియల్-టైమ్‌లో 'సంజ్ఞా భాష'లోకి అనువదించేలా చేసి దివ్యాంగులకు సాంకేతికత ఏ విధంగా తోడ్పడుతుందో స్వయంగా నిరూపించారు. "భారత్ ఏఐని చూసి భయపడటం లేదు.. అందులో భవిష్యత్తును వెతుక్కుంటోంది" అని ధీమా వ్యక్తం చేస్తూ, 'డిజైన్ ఇన్ ఇండియా - డెలివరీ టు వరల్డ్' నినాదంతో భారత్ ప్రపంచానికి ఏఐ రంగంలో దిశానిర్దేశం చేస్తుందని ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు.
సమ్మిట్ వేదిక వద్ద నిరసనల కలకలం
ఢిల్లీలోని భారత్ మండపంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్' జరుగుతున్న వేదిక వద్ద ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అనూహ్య రీతిలో నిరసన చేపట్టారు. ఒక బృందంగా వచ్చిన కార్యకర్తలు తమ చొక్కాలను విప్పి, శరీరాలపై ("Compromised PM") ‘రాజీపడిన ప్రధాని’ అని రాసుకుని నినాదాలు చేయడం సంచలనం సృష్టించింది. సమ్మిట్ వేదికగా ప్రధాని దేశ అస్తిత్వాన్ని పణంగా పెట్టారని వారు ఆరోపించారు.
అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం - క్షమాపణకు డిమాండ్
ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా నుంచి బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అసభ్యకరమైన నినాదాలు చేయడం అత్యంత "సిగ్గుచేటు" అని ఆయన అభివర్ణించారు. దేశాన్ని ప్రపంచ స్థాయిలో అవమానించేందుకు కాంగ్రెస్ ఏ స్థాయికైనా దిగజారుతుందని మండిపడుతూ, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశాభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంత సమస్య అని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. ఒక వీడియో సందేశం ద్వారా ఆయన మాట్లాడుతూ, భారత్ గ్లోబల్ ఏఐ హబ్‌గా ఎదుగుతుంటే కాంగ్రెస్ ఇలాంటి చర్యలతో అడ్డు తగలడం వారి సంకుచితత్వాన్ని చూపిస్తుందని విమర్శించారు. అభివృద్ధి పట్ల కాంగ్రెస్ వైఖరి దేశ ప్రతిష్టను మసకబార్చేలా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రహ్లాద్ జోషి ఘాటు వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కలబురగిలో విలేకరులతో మాట్లాడుతూ, ఈ నిరసనలు కాంగ్రెస్ పార్టీ "విధ్వంసక మనస్తత్వానికి" నిదర్శనమని అన్నారు. సమ్మిట్ ఇంత ఘనంగా విజయవంతం కావడాన్ని చూసి ఓర్వలేక, కేవలం అసూయతోనే రాహుల్ గాంధీ తన మనుషులను ఉసిగొల్పారని ఆయన ఆరోపించారు. దేశ వృద్ధిని తక్కువ చేసి చూపే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.
పోలీసుల చర్యలు, కాంగ్రెస్ వాదన
ఈ నిరసనలపై ఢిల్లీ పోలీసులు స్పందిస్తూ, బహిరంగ ప్రదేశంలో చొక్కాలు విప్పి నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. మరోవైపు, ఏఐ సమ్మిట్‌లో దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారని తాము విశ్వసిస్తున్నామని, అందుకే ఈ రీతిలో గళమెత్తామని యూత్ కాంగ్రెస్ తన అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.
