
ఏఐ భయం వద్దు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారంటూ చర్చ జరుగుతోంది. ఏఐ పట్ల ముఖ్యంగా సాఫ్టవేర్ ఉద్యోగుల్లో ఆందోళన, భయం ఉంది. తమ ఉద్యోగాలను ఏఐ కభళించి వేస్తుందని భావిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. భయపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగులకు సహాయ పడుతుందని పేర్కొన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర ఉద్యోగాలను తొలగించడం కాదని అన్నారు. అందుకు ఉదాహరణగా గూగుల్ కస్టమర్ ఎంగేజ్మెంట్ సూట్ ను ఉదహరించారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేదికను ఉద్యోగులను తొలగించడానికి కాకుండా, కస్టమర్లకు వేగంగా సమాధానాలు ఇవ్వడానికి ఉపయోగిస్తున్నట్టు థామస్ కురియన్ తెలిపారు. మొదటిసారి దీనిని ప్రవేశపెట్టినప్పుడు, ఇక నుంచి ఉద్యోగుల అవసరం ఉండదా అంటూ చాలా మంది అడిగారని, కానీ తమ క్లయింట్లు ఎవరూ కూడా ఉద్యోగులను తొలగించలేదని పేర్కొన్నారు.
ఇటీవల గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ఏఐ విషయంలో సానుకూల వాదన వినిపించారు. గూగుల్ ఇంజినీర్లు పది శాతం ప్రొడక్టివ్ గా పనిచేయడానికి ఏఐ సహకరిస్తుందని, మరింత సృజనాత్మకంగా..అర్థవంతంగా పని చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఏఐను ఉద్యోగులను తొలగించి.. వారికి ప్రత్యామ్నాయంగా కాకుండా , వారి ఉత్పాదకతను పెంచే సాధనంగా సుందర్ పిచాయ్, థామస్ కురియన్ చూస్తున్నారు. వాస్తవంగా టెక్నాలజీ లక్ష్యం వేగంగా మారుతున్న సమాజంలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ, వారికి సహకరించేదిగా ఉండాలి. అలా కాకుండా ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా మారటం టెక్నాలజీ లక్ష్యం కాకూడదు. అది సమాజానికి శ్రేయస్కరం కాదు.
ఇప్పటికే ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పుడు ఏఐ మరిన్ని ఉద్యోగాలను హరిస్తే.. అది ప్రమాదకరం. మనిషికి టెక్నాలజీ ప్రత్యామ్నాయంగా మారటం మంచి సంకేతం కాదు. మనిషికి సహకరించేలా ఉండాలి. అది మానవ సమాజ వికాసానికి తోడ్పడుతుంది. ఉద్యోగాల కల్పన అన్నది ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద సమస్య. ఎంతో మంది ఇప్పటికీ నిరుద్యోగులుగా ఉన్నారు. ఐటీ రాకతో సేవా రంగంలో లక్షలాది మందికి ఉపాధి దొరికింది. అన్ని విభాగాలకు ఐటీ సేవలు అత్యవసరం కావడం, డిజిటల్ యుగం వైపు ప్రపంచం పరుగులు తీస్తున్న సమయంలో మరింత మందికి ఉద్యోగాలు లభించాయి. కానీ ఏఐ రాకతో వారిలో ఆందోళన మొదలైంది. కొంత మంది ఏఐ పట్ల ఆశావాహ దృక్ఫథాన్ని కనబరుస్తుంటే.. మరికొందరు ఉద్యోగాలను హరించి వేస్తుందని మాట్లాడటం ప్రస్తుత గందరగోళానికి కారణం.
