Let's talk: editor@tmv.in
ఏఐ పరివర్తనలో భారత్‌ ముందంజలో ఉంది: ప్రధాని మోడీ

ఏఐ పరివర్తనలో భారత్‌ ముందంజలో ఉంది: ప్రధాని మోడీ

Pinjari Chand
17 ఫిబ్రవరి, 2026

కృత్రిమ మేధస్సు (ఏఐ) పరివర్తనలో భారత్‌ ముందంజలో నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం పేర్కొన్నారు. ఏఐ రంగంలో భారత్‌ సాధిస్తున్న పురోగతి దేశ ఆశయాలను మాత్రమే కాకుండా బాధ్యతాయుత దృక్పథాన్ని కూడా ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026’ ప్రారంభోత్సవానికి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఏఐపై ప్రపంచాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడం ఆనందంగా ఉంది. ఢిల్లీలో జరుగుతున్న ఈ సమ్మిట్‌కు ప్రపంచ నాయకులు, పరిశ్రమల ప్రతినిధులు, ఆవిష్కర్తలు, విధాన రూపకర్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులందరికీ స్వాగతం పలుకుతున్నానని మోడీ ఎక్స్ లో పేర్కొన్నారు. ఈ సమ్మిట్‌ థీమ్‌ ‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’ అని ఆయన తెలిపారు. అంటే అందరికీ మేలు, అందరికీ సుఖం అనే భావనతో మానవ కేంద్రిత అభివృద్ధికి ఏఐని వినియోగించాలనే సంకల్పాన్ని ఇది ప్రతిబింబిస్తుందని అన్నారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పాలన, వ్యాపార రంగాల్లో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందని పేర్కొన్నారు. ఆవిష్కరణ, సహకారం, బాధ్యతాయుత వినియోగం వంటి అంశాలపై ఈ సమ్మిట్‌ ప్రపంచవ్యాప్త చర్చలకు దోహదం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమ్మిట్‌ ఫలితాలు ప్రగతిశీల, ఆవిష్కరణలతో కూడిన, అవకాశాలకు దారి తీసే భవిష్యత్తును నిర్మించడంలో కీలకంగా ఉంటాయని మోడీ అన్నారు. భారత్‌లోని 140 కోట్ల ప్రజల సహకారంతో దేశం ఏఐ పరివర్తనలో అగ్రగామిగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, చురుకైన స్టార్టప్‌ వ్యవస్థ, ఆధునిక పరిశోధనలు భారత్‌ను ఈ రంగంలో ముందుకు నడిపిస్తున్నాయని తెలిపారు.

సమ్మిట్ ప్రారంభం

కృత్రిమ మేధ (ఏఐ)పై గ్లోబల్ సౌత్‌లో ఇంతటి విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్న తొలి గ్లోబల్ సమ్మిట్‌గా ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్–2026 సోమవారం భారత్ మండపంలో ప్రారంభమైంది. సమగ్ర వృద్ధి, ప్రజా వ్యవస్థల బలోపేతం, సుస్థిర అభివృద్ధిలో ఏఐ పాత్రపై ప్రపంచ దేశాల ప్రతినిధులు ఈ వేదికపై చర్చించనున్నారు. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్‌లో 100కు పైగా ప్రభుత్వ ప్రతినిధులు, 20కి పైగా దేశాధినేతలు, 60 మంది మంత్రులు/ఉపమంత్రులు, 500కు పైగా గ్లోబల్ ఏఐ లీడర్స్, సీఈఓలు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, సీటీఓలు, సేవా సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు. ఫిబ్రవరి 19న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభోపన్యాసం ఇవ్వనున్నారు.

మూడు గ్లోబల్ ఇంపాక్ట్ చాలెంజ్‌లు

AI for ALL, AI by HER, YUVAi అనే మూడు ఫ్లాగ్‌షిప్ చాలెంజ్‌లకు 60కు పైగా దేశాల నుంచి 4,650కిపైగా దరఖాస్తులు వచ్చాయి. కఠినమైన బహుళ స్థాయి మూల్యాంకనం అనంతరం టాప్ 70 జట్లు ఫైనలిస్టులుగా ఎంపికయ్యాయి. వీరు ఫిబ్రవరి 16, 17న భారత్ మండపం, సుష్మా స్వరాజ్ భవన్లో గ్రాండ్ ఫినాలేలో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు.

రీసెర్చ్ సింపోజియం

ఫిబ్రవరి 18న ఐఐటీ, హైదరాబాద్ భాగస్వామ్యంతో “ఏఐ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ” రీసెర్చ్ సింపోజియం నిర్వహించనున్నారు. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా నుంచి సుమారు 250 పరిశోధనా పత్రాలు అందాయి. ఎస్టోనియా అధ్యక్షుడు అలార్ కరిస్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట్ర మంత్రి జితిన్ ప్రసాద పాల్గొననున్నారు. ఏఐ సురక్షిత వినియోగం, గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్‌లు, గ్లోబల్ సౌత్ భాగస్వామ్యంపై చర్చలు జరుగనున్నాయి.

జియో ఏఐ పావిలియన్‌ను సందర్శించిన ప్రధాని

సమ్మిట్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జియో ఇంటెలిజెన్స్ పావిలియన్‌ను సందర్శించారు. ఆకాష్ అంబానీ, రిలయన్స్ జియో చైర్మన్, జియో రూపొందించిన సమగ్ర ఏఐ ఎకోసిస్టమ్‌పై వివరాలు అందించారు.ప్రధాని జియో ఏఐ ఉత్పత్తులను పరిశీలించారు. ‘ఏఐ ఫర్ ఆల్ ’లక్ష్యంతో సాంకేతికతను సమాజానికి అందుబాటులోకి తీసుకురావడమే తమ దృష్టి అని సంస్థ తెలిపింది. ముకేష్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, సాంకేతికత సమాన ప్రయోజనం చేకూర్చాలని గతంలో ప్రస్తావించిన సంగతి గుర్తుచేశారు.

ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026

ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్ పో 2026 కూడా ఫిబ్రవరి 16–20 వరకు భారత్ మండపంలో జరుగుతోంది. 70,000 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో 10 విభాగాలుగా ఏర్పాటు చేసిన ఈ ఎక్స్‌పోలో 300కు పైగా ప్రదర్శన పావిలియన్లు, 600కు పైగా స్టార్టప్‌లు పాల్గొంటున్నాయి. పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ అనే మూడు థీమ్స్ ఆధారంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, యుకే, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల పావిలియన్లు కూడా ఏర్పాటు చేశారు. సుమారు 2.5 లక్షల మంది సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉన్న ఈ కార్యక్రమంలో 500కు పైగా సెషన్లలో 3,250 మందికి పైగా నిపుణులు పాల్గొని వివిధ రంగాల్లో ఏఐ ప్రభావంపై చర్చించనున్నారు. ఈ సమ్మిట్ ద్వారా గ్లోబల్ ఏఐ చర్చల్లో భారత్ కీలక వేదికగా అవతరిస్తూ, బాధ్యతాయుత, సమగ్ర అభివృద్ధి దిశగా ఏఐ వినియోగాన్ని ముందుకు తీసుకెళ్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు.