Let's talk: editor@tmv.in
ఏఐ నుంచి అంతరిక్షం వరకు భారత స్టార్టప్‌లు: ప్రధాని మోడీ

ఏఐ నుంచి అంతరిక్షం వరకు భారత స్టార్టప్‌లు: ప్రధాని మోడీ

Pinjari Chand
26 జనవరి, 2026

భారతదేశ స్టార్టప్‌లు నేడు కృత్రిమ మేధస్సు (ఏఐ), అంతరిక్షం, అణుశక్తి, సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రజన్, బయోటెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాల్లో పనిచేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 130వ ఎపిసోడ్‌లో ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశ యువ వ్యోమగాములను ప్రశంసించిన ప్రధాని, భారత్‌లో తయారయ్యే ప్రతి ఉత్పత్తికి నాణ్యతే గుర్తింపుగా మారాలని పిలుపునిచ్చారు. ఏఐ, స్పేస్, అణుశక్తి, సెమీకండక్టర్లు, మొబిలిటీ, గ్రీన్ హైడ్రజన్—ఏ రంగం చూసినా అక్కడ భారత స్టార్టప్ తప్పకుండా ఉంటుంది. స్టార్టప్‌లతో పనిచేస్తున్న నా యువ మిత్రులందరికీ, కొత్తగా ప్రారంభించాలనుకుంటున్న వారికి నా అభినందనలని ప్రధాని అన్నారు. భారత ఆర్థిక ప్రగతిని ప్రస్తావిస్తూ ఇకపై ప్రమాణాల్లో రాజీపడే యుగం ముగిసిందని స్పష్టం చేశారు. టెక్స్టైల్స్‌, టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌, ప్యాకేజింగ్‌—ఏది అయినా సరే, ‘భారత ఉత్పత్తి’ అంటేనే ‘ఉత్తమ నాణ్యత’ అనే భావన ప్రపంచవ్యాప్తంగా ఏర్పడాలి. జీరో డిఫెక్ట్‌, జీరో ఎఫెక్ట్‌ మన లక్ష్యం కావాలని ఆయన చెప్పారు.

ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా ఎదిగిందని తెలిపారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమానికి 10 ఏళ్లు పూర్తైన సందర్భంగా, 2016లో 500కంటే తక్కువగా ఉన్న స్టార్టప్‌ల సంఖ్య నేడు 2 లక్షలకు పైగా చేరిందని వెల్లడించారు. దీనికి యువతలోని వినూత్న ఆలోచనలు, రిస్క్ తీసుకునే ధైర్యమే కారణమని చెప్పారు. అదేవిధంగా వచ్చే నెలలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ నిపుణులు పాల్గొని, ఏఐ రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రదర్శిస్తారని తెలిపారు. నాణ్యత, వినూత్నతలే వికసిత భారత్ లక్ష్యాన్ని వేగవంతం చేస్తాయని ప్రధాని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పించిన ఆయన, ఓటరే ప్రజాస్వామ్యానికి ఆత్మ అని అన్నారు. 18 ఏళ్లు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియను బలంగా నిలబెట్టే క్షేత్ర స్థాయి ఎన్నికల సిబ్బందిని కూడా ప్రధాని ఈ సందర్భంగా అభినందించారు.

ఔషధ మొక్కలపై చేసిన సేవలకు మధ్యప్రదేశ్ యువకుడికి ప్రశంస

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాకు చెందిన యువకుడు జగదీష్ ప్రసాద్ అహిర్వార్ చేసిన కృషిని ప్రశంసించారు. అటవీ శాఖలో బీట్‌ గార్డ్‌గా పనిచేస్తున్న జగదీష్, అడవుల్లో ఉన్న అనేక ఔషధ మొక్కల వివరాలు సక్రమంగా నమోదు కాలేదని గుర్తించి, స్వయంగా వాటిని గుర్తించి నమోదు చేయడం ప్రారంభించారు. 125కిపైగా ఔషధ మొక్కలను గుర్తించిన ఆయన, ప్రతి మొక్కకు సంబంధించిన పేరు, ఉపయోగం, లభించే ప్రాంతం వంటి వివరాలతో పాటు ఫొటోలు సేకరించారు. ఈ సమాచారాన్ని అటవీ శాఖ పుస్తకంగా ప్రచురించిందని ప్రధాని తెలిపారు. అలాగే, అయోధ్య గుండా ప్రవహించి గంగానదిలో కలిసే తమ్సా నది పునరుద్ధరణకు ప్రజలు చేసిన ప్రయత్నాలను కూడా ప్రశంసించారు. కాలుష్యం వల్ల అంతరాయం ఏర్పడిన నది ప్రవాహాన్ని ప్రజల సమష్టి కృషితో తిరిగి పునరుజ్జీవం చేశారని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్రాంతంలో తీవ్ర కరువును ఎదుర్కొంటున్న పరిస్థితులను ప్రస్తావించిన ప్రధాని, ‘అనంత నీరు సంరక్షణం’ ప్రాజెక్టు ద్వారా 10కిపైగా చెరువులు పునరుద్ధరించడంతో పాటు 7,000కిపైగా చెట్లు నాటినట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌ బీహార్ జిల్లాకు చెందిన బెనోయ్ దాస్ చేసిన హరిత కార్యక్రమాలను కూడా ప్రధాని ప్రశంసించారు. సొంత ఖర్చుతొ వేల సంఖ్యలో చెట్లు నాటడం ద్వారా జిల్లా పచ్చదనాన్ని పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు.