Let's talk: editor@tmv.in
ఏఐ తాంత్రికుడు

ఏఐ తాంత్రికుడు

FL - TRND
22 అక్టోబర్, 2025

అర్ధరాత్రి నిశ్శబ్దంలో తెర వెలుగుతుంది. ఓవైపు చీకటిలో మెరుస్తున్న కాంతి.. మరోవైపు కీబోర్డ్ మీద జారుతున్న వేళ్లు.. ఇంకోవైపు తెరపై మెరుస్తున్న మంత్ర చిహ్నాలు. మనం అనుకునే మాంత్రిక లోకం ఇప్పుడు కేవలం అఘోర తంత్రమే కాదు. ఇది కృత్రిమ మేధస్సు పుట్టించిన కొత్త యుగం. మంత్రం, యంత్రం, భయం, విశ్వాసం కలిసిపోయి ఒక కొత్త మాయాజాలాన్ని సృష్టించాయి. ఈ లోకంలో నమ్మకం ఒక ఆయుధం.. భయం ఒక వ్యాపారం. సోషల్ మీడియా అనే అద్దంలో నల్ల మబ్బుల్లా తేలుతూ వచ్చింది ఒక పేరు..! అదే అఘోరి జీ రాజస్థాన్. అతని వెనుక దాగి ఉన్నది మంత్రం కాదు యంత్రం. చూడగానే గుండె కదిలించే దృశ్యాలు, గాలిలో తేలే నీడలు, జ్వాలల్లో రూపం దాల్చిన ఆత్మలు..! ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మేధస్సు పుట్టించిన భ్రమలు. ఈ డిజిటల్ యుగంలో తాంత్రిక మాయ కొత్త రూపం దాల్చింది. ఆ రూపంతోనే అఘోరి జీ రాజస్థాన్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ఎంతోమందిని బురిడికొట్టించాడు.

అతని అసలు పేరు రాహుల్. వయసు 20 మాత్రమే. కానీ ఆ చిన్న వయసులోనే ఒక డిజిటల్ మాయ ప్రపంచాన్ని సృష్టించాడు. రాజస్థాన్‌లోని చిన్న పట్టణం ఝున్‌ఝున్‌లో కూర్చొని, దేశం మొత్తం మీద మాయా వల విసిరాడు. అఘోరి జీ రాజస్థాన్ అనే పేరుతో సోషల్ మీడియాలో తాంత్రిక వేషం వేసుకున్నాడు. అతని వీడియోల్లో ఆవిరి లాగా ఎగసే జ్వాలలు, కదిలే నీడలు, మంత్రాల మంటలు ఉంటాయి. అవి నిజం కాదు. అదంతా AI సృష్టించిన మాయ. కృత్రిమ మేధస్సుతో తయారైన భయాల దృశ్యాలతో ప్రజలను బోల్తా కొట్టించాడు. అతని ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలు చూసిన వారు షాక్‌ అయ్యారు. ఎక్కడో ఎవరో తమను శపిస్తున్నారేమో, ఎదో దెయ్యం వెంటాడుతోందేమో అని భయపడ్డారు. అదే భయాన్ని ఆయుధంగా మార్చుకున్నాడు రాహుల్. సోషల్ మీడియా నుంచి వెబ్‌సైట్‌ వరకు తన మాయా సామ్రాజ్యాన్ని విస్తరించాడు. చాట్‌లలో మృదువైన మాటలు, ఫోన్‌లో భయపెట్టే స్వరం, తర్వాత నమ్మకం అనే మంత్రం. ఇలా ఒక్కొక్కరినీ తన వలలో పడేసుకున్నాడు. ఎవరికైనా కుటుంబ సమస్య, ఎవరికైనా ప్రేమ విఫలం, ఎవరికైనా వ్యాపార నష్టం.. ఇలా ప్రతీ బాధకు ఒక మంత్రం ఉందని చెప్పి పూజ పేరుతో డబ్బులు తీసుకున్నాడు. యూపీఐ ద్వారా చెల్లింపులు జరిగాయి. ప్రతీ ఒక్కరి నుంచి 5 వేల నుంచి లక్ష రూపాయల వరకు దండుకున్నాడు. ప్రతీ లావాదేవీతో మంత్రం బలపడుతుందని చెప్పాడు. కానీ మంత్రం ముగిసిన తర్వాత, ఫోన్‌ ఫోన్‌ స్వీచ్‌ ఆఫ్‌. చాట్‌లు మాయమయ్యాయి. ఇది మంత్రం కాదు, మోసమని తెలిసేలోపే బాధితుల బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఖాళీ అయ్యింది. ఇలా మొత్తం 50మందిని బకరా చేశాడు రాహుల్.

ఒక రోజు ఢిల్లీలోని ఓ యువతి ఆ భ్రమలో చిక్కుకుంది. తన ఇంట్లో ఆత్మలు తిరుగుతున్నాయని నమ్మింది. అఘోరిని ఆన్‌లైన్‌లో ఆశ్రయించింది. ఒక లక్ష రూపాయలు చెల్లించింది. పూజ జరిగిందని వీడియోలు వచ్చాయి. ఆ తర్వాత రాహుల్‌ ఫోన్‌ లిఫ్ట్ చేయలేదు. చివరికి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో డిజిటల్ తాంత్రికుడి కోసం వేట మొదలైంది. సైబర్ పోలీసు బృందం చీకటిలో లైట్ ఆన్‌ చేసింది. డబ్బు ఎక్కడికి వెళ్తుందో చూసింది. ప్రతి యూపీఐ లావాదేవీ వెనుక ఒక కథ ఉంది. ప్రతి ఖాతా చివర రాహుల్ అనే పేరు వెలుగులోకి వచ్చింది. అతను ఎప్పటికప్పుడు తన స్థలాన్ని మార్చుతూ పారిపోయాడు. కానీ యంత్రం సృష్టించిన భ్రమలకన్నా సత్యం వేగంగా పరిగెత్తింది. ఝున్‌ఝున్ పట్టణంలో చివరికి వల వేశారు. తలుపులు కొట్టిన క్షణంలో భయం అతని గుండెల్లో నాటుకుపోయింది. పట్టుబడ్డ రాహుల్ వద్ద మూడు ఫోన్లు, ఐదు సిమ్ కార్డులు, మూడు డెబిట్ కార్డులు ఉన్నాయి. ప్రతి పరికరంలో చీకటి లావాదేవీల గుర్తులున్నాయి. అతను తన కుటుంబ సభ్యుల ఖాతాల ద్వారా డబ్బు తిప్పినట్లు అంగీకరించాడు. నెలల తరబడి ప్రజల నమ్మకాన్ని మోసం చేసి తానే తాంత్రికుడని నమ్మించుకున్నాడు. కానీ సత్యం చివరికి ప్రతి మంత్రాన్ని విరిచేసింది.

ఈ ఘటన ఒక కొత్త భయానక సత్యాన్ని బయట పెట్టింది. ఇది కేవలం మోసం కాదు. ఇది విశ్వాసం మీద యంత్రం చేసిన దాడి. కృత్రిమ మేధస్సు చేతుల్లో భయం కొత్త రూపం దాల్చింది. ఎవరైనా ఒక ఫోన్‌తో దేవుడవ్వగలరు, భూతమవ్వగలరు, తాంత్రికుడవ్వగలరు. స్క్రీన్ వెనుక కూర్చొని వాస్తవం లేని ప్రపంచాన్ని సృష్టించగలరు. మనసులోని భయమే వారి బిజినెస్. ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. మాయా వీడియోలు, దెయ్యాల దృశ్యాలు, మంత్రాల గళాలు నిజం కావు. అసలు దెయ్యాలు ఉన్నాయని చెప్పడానికి సైంటిఫిక్‌గా ఎలాంటి ఆధారాలూ లేవు. ఇవి కృత్రిమ మేధస్సు పుట్టించిన నీడలు మాత్రమే. గతంలోనూ ఇలాంటి మోసాలు జరిగేవి కాని.. ఇప్పుడు డిజిటల్ యుగంలో మంత్ర శక్తి కీబోర్డ్‌పై నిలిచింది. ఆ శక్తిని జాగ్రత్తగా వాడాలి. చీకటి ఎంత గాఢంగా ఉన్నా ఒక వెలుగు సరిపోతుంది. ఆ వెలుగు మనసులోని జ్ఞానం మాత్రమేనండి. ఇది గుర్తుపెట్టుకోండి..!