Let's talk: editor@tmv.in
ఏఐ డీప్‌ఫేక్‌తో టీడీపీ నాయకులకు బురిడీ

ఏఐ డీప్‌ఫేక్‌తో టీడీపీ నాయకులకు బురిడీ

FL - SUNL
11 అక్టోబర్, 2025

ఏఐ టెక్నాలజీ తెలుగుదేశం నేతలను బురిడీ కొట్టించింది. తమ పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా వీడియో కాల్‌లో మాట్లాడుతున్నారనుకుని పొరబడి తెలుగు తమ్ముళ్లు మూల్యం చెల్లించుకున్నారు. తెలంగాణకు చెందిన 18 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డీప్‌ఫేక్ సాంకేతికత ద్వారా నిర్వహించిన మోసానికి బలైన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. టీడీపీ అధినేత చంద్రబాబు, సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు మొహాలతో నకిలీ వీడియో కాల్స్ చేసిన దుండగుడు, నాయకుల నుంచి లక్షల రూపాయలు దోచుకున్నాడు. ఏలూరుకు చెందిన ఓ యువకుడు ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని టీడీపీ నాయకులకు సెప్టెంబర్ 30న ఓ వ్యక్తి ఫోన్ చేసి, దేవినేని ఉమా పీఏగా పరిచయం చేసుకున్నాడు. "కాసేపట్లో ఉమా వీడియో కాల్ చేస్తారు" అని చెప్పగా, దేవినేని ఉమా మొహంతో పోలిన వ్యక్తి ఏఐ డీప్‌ఫేక్ వీడియో కాల్ ద్వారా మాట్లాడి, "పార్టీ కార్యకర్తల పిల్లల చదువుకు సహాయం చేయాలని, మూడు ఫోన్‌పే నంబర్లకు డబ్బు పంపాలని" కోరాడు. దీంతో ఒక నాయకుడు రూ.35 వేలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. మరో వారంలో, అక్టోబర్ 7న, అదే వ్యక్తి మళ్లీ ఫోన్ చేసి, "స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తాం. చంద్రబాబు కాసేపట్లో వీడియో కాల్ చేస్తారు" అని చెప్పాడు. చెప్పినట్లుగానే చంద్రబాబు మొహంతో పోలిన నకిలీ వీడియో కాల్ వచ్చింది. "విజయవాడకు వస్తే కలుస్తాను, బీ-ఫాం ఇస్తాను" అని హామీ ఇవ్వడంతో, 18 మంది నాయకులు విజయవాడకు చేరుకున్నారు. "హోటల్ బిల్లు మేమే చెల్లిస్తాం" అని దుండగుడు చెప్పడంతో, నాయకులు విజయవాడలోని ఓ హోటల్‌లో బస చేశారు.సాయంత్రం మరో ఫోన్ కాల్‌లో, "చంద్రబాబును కలవడానికి 8 మందికి మాత్రమే అనుమతి ఉంది. ఒక్కొక్కరు రూ.10 వేలు చెల్లించాలి" అని దుండగుడు తెలిపాడు. అనుమానం కలిగిన నాయకులు, హోటల్ ఫుడ్ బిల్ చెల్లించమని సిబ్బంది ఒత్తిడి చేయడంతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు దేవినేని ఉమాకు ఫోన్ చేయగా, "నేను ఎవరికీ కాల్ చేయలేదు" అని స్పష్టం చేశారు. మోసపోయామని గ్రహించిన నాయకులు, పరువు భయంతో ఫిర్యాదు చేయకుండా సైలెంట్‌గా వెనుదిరిగారు.

డీప్‌ఫేక్ ముప్పు: పెరుగుతున్న సైబర్ నేరాలు

ఈ ఘటన తర్వాత పోలీసుల విచారణలో ఈ మోసానికి ఏలూరుకు చెందిన ఓ యువకుడు కారణమని తేలింది. ఏఐ డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా నకిలీ వీడియో కాల్స్ సృష్టించి, నాయకులను నమ్మించాడు. ఇటీవల భారతదేశంలో డీప్‌ఫేక్ మోసాలు గణనీయంగా పెరిగాయి. 2025లో సైబర్ నేరాలు 21 రెట్లు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. బెంగళూరు, కేరళ, తెలంగాణలో నారాయణ మూర్తి, ముకేష్ అంబానీ, సీఎం రేవంత్ రెడ్డి లాంటి ప్రముఖుల డీప్‌ఫేక్ వీడియోలతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న కేసులు నమోదయ్యాయి. ఇదే తరహాలో జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలు కూడా భయపెడుతున్నాయి. 2024లో 1.23 లక్షల కేసులతో రూ. 2,140 కోట్ల నష్టం వాటిల్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ నిపుణులు

సైబర్ నిపుణులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వీడియో కాల్స్‌లో అధికారిక నంబర్ల ద్వారా వెరిఫై చేయాలని, లేదంటే మోసపోతారని హెచ్చరిస్తున్నారు. తెలియని నంబర్ల నుంచి కాల్స్‌ వస్తే డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయవద్దని చెబుతున్నారు. డీప్‌ఫేక్ వీడియోనా కాదా అనేది గుర్తించడానికి నంబర్ సేవ్ అయినదా కాదా, కాల్ మాట్లాడుతున్న వారు తెలిసిన వారేనా అనేవాటితోపాటు పెదవుల కదలిక, బ్లింకింగ్ లాంటివి గమనించాలని కోరుతున్నారు. ఏదైనా మోసం జరిగినట్లు సందేహం వస్తే 1930కు కాల్ చేయాలి లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

ఏఐ డీప్‌ఫేక్‌తో టీడీపీ నాయకులకు బురిడీ - Tholi Paluku