Let's talk: editor@tmv.in
ఏఐ జాబ్‌ కూడా సేఫ్‌ కాదు

ఏఐ జాబ్‌ కూడా సేఫ్‌ కాదు

Dr.Chokka Lingam
4 నవంబర్, 2025

: ప్రస్తుతం ఐటీ రంగంలోనే కాకుండా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలోనూ ఉద్యోగాల భద్రతపై సందేహాలు మొదలయ్యాయి. రెండేళ్లుగా కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టి, అత్యధిక జీతాలతో ఏఐ ఇంజినీర్లను నియమించుకున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారినట్లుంది. తాజాగా మెటా తన ఏఐ విభాగాన్ని విభజించి, ఉద్యోగులను తగ్గించే ఆలోచనలో ఉందని వార్తలు రావడం ఈ అనుమానాలను మరింత పెంచింది. ఇది కేవలం ఒక సంస్థలో జరుగుతున్న పరిణామం మాత్రమే కాదు, పరిశ్రమ మొత్తంలో హైప్ తగ్గిపోతోందనే సంకేతంగా కూడా చాలామంది దీన్ని చూస్తున్నారు. ఏఐతో అన్నివైపులా విప్లవం వస్తుందని భావించిన ఆశలు కాస్త వెనక్కి తగ్గుతున్నాయి. దీని కారణంగా ఉద్యోగులలో ఆందోళన మరింత పెరిగింది.

మెటా తన ఏఐ విభాగాన్ని కొత్తగా మార్చడానికి నిర్ణయించుకుంది. దీని ప్రకారం మొత్తం డిపార్ట్‌మెంట్‌ను నాలుగు వేర్వేరు బృందాలుగా విడదీసింది. ఒక బృందం పెద్ద లాంగ్వేజ్ మోడల్స్‌పై దృష్టి పెడతాయి.. మరో బృందం పరిశోధన పనులను కొనసాగిస్తోంది. వినియోగదారుల కోసం కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ఒక ప్రత్యేక బృందం ఏర్పడింది. డేటా సెంటర్లు, కంప్యూటింగ్ హార్డ్‌వేర్ లాంటి మౌలిక వసతులపై దృష్టి పెట్టడానికి మరో బృందం ఏర్పాటు చేశారు. ఇదంతా ఉద్యోగాల కోతలకు సంకేతంగా మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కేవలం మెటా సమస్య మాత్రమే కాదు, మొత్తం టెక్ పరిశ్రమలోనూ ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థలు కూడా భారీగా పెట్టుబడులు పెట్టినా ఆశించినంత వేగంగా ఫలితాలు రాలేదు. చాలా ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి. అనేక సంస్థలు తమ వర్క్‌ఫ్లోలో ఏఐని ఉపయోగించాలనుకున్నా, అది ఖర్చుతో కూడుకున్న ప్రక్రియగా మారింది. లాభాల కంటే ఖర్చులు ఎక్కువయ్యాయి. ఈ కారణంగా పెట్టుబడిదారుల ఉత్సాహం కూడా తగ్గిపోయి, మార్కెట్‌లో ఏఐపై ఉన్న హైప్ కొంచెం కొంచెంగా తగ్గుతున్నట్లుగా అనిపిస్తోంది.

ఇటీవల ఎంఐటీ నిర్వహించిన 'స్టేట్ ఆఫ్ ఏఐ ఇన్ బిజినెస్ 2025' అధ్యయనం కూడా ఈ అనుమానాలను బలపరిచింది. ఆ నివేదిక ప్రకారం, ఏఐ ప్రాజెక్టులు ప్రారంభించిన సంస్థల్లో కేవలం 5 శాతం మాత్రమే భారీగా ఆదాయాన్ని సాధించగలిగాయి. మిగతా ప్రాజెక్టులు స్థిరంగా నిలవలేకపోయాయి. కొన్ని పూర్తిగా విఫలమయ్యాయి. చాలామంది తమకంటూ ఏఐ టూల్స్ రూపొందించుకోవడానికి ప్రయత్నించినా.. వాటిలో ఎక్కువ భాగం వ్యాపారపరంగా ఉపయోగ పడలేదు. దీని కారణంగా ఏఐను వాస్తవ ప్రపంచంలో అమలు చేయడం అంత సులభం కాదనే విషయం స్పష్టమైంది. కానీ కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది చాలా సహజమట. కొత్త టెక్నాలజీ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా మొదట్లో విపరీతమైన అంచనాలు ఉంటాయి. తర్వాత వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా స్థిరపడతాయి. ఏఐ కూడా అదే మార్గంలో వెళ్తోందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే తాత్కాలికంగా అయినా ఉద్యోగులపై, పెట్టుబడులపై, పరిశ్రమల అంచనాలపై ఏఐ హైప్ తగ్గడం మాత్రం స్పష్టంగానే కనిపిస్తోంది.

ఏఐ జాబ్‌ కూడా సేఫ్‌ కాదు - Tholi Paluku