Let's talk: editor@tmv.in
ఏఐ ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్‌గా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు

ఏఐ ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్‌గా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు

Gaddamidi Naveen
21 ఫిబ్రవరి, 2026

కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ఆవిష్కరణలకు తెలంగాణ రాష్ట్రం ప్రపంచ స్థాయి కేంద్రంగా అవతరిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌-2026' సందర్భంగా యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు.

ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, బలమైన సాంకేతిక వాతావరణం, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు రాష్ట్రాన్ని పెట్టుబడులకు అనుకూల గమ్యస్థానంగా మార్చాయని ఆయన తెలిపారు. భవిష్యత్‌కు అనుగుణమైన, స్థిరమైన విధానాల వల్ల ఏఐ పరిశోధన, అమలు రంగాల్లో తెలంగాణ దృఢమైన పునాది వేసుకుందని పేర్కొన్నారు. అమెరికా టెక్ సంస్థలతో ప్రజా-ప్రైవేట్ భాగస్వామ్యాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఏఐ సాంకేతికతను ప్రభుత్వ సేవల్లో రియల్ టైమ్ మానిటరింగ్ కోసం వినియోగిస్తున్నామని ఆయ‌న చెప్పారు.

ప్రభుత్వ ప్రాధాన్యతలు - బడ్జెట్ కేటాయింపులు

ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, పట్టణాభివృద్ధి వంటి కీలక రంగాల్లో ప్రత్యేక ఆవిష్కరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, తెలంగాణను ఏఐ రంగంలో ముందంజలో నిలిపామని మంత్రి వివరించారు. త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో ఏఐ యూనివర్సిటీ స్థాపన, ఏఐ హబ్‌ల విస్తరణ, నైపుణ్యంతో కూడిన మానవ వనరుల తయారీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.

భద్రతే ఆవిష్కరణకు పునాది

సాంకేతిక అభివృద్ధికి భద్రతా ప్రమాణాలు అడ్డంకి కావని, అవే ఆవిష్కరణలకు పునాది అని మంత్రి స్పష్టం చేశారు. భద్రతా ప్రమాణాలు లేకుండా జరిగే వృద్ధి ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని, బాధ్యతాయుత ప్రమాణాలే కృత్రిమ మేధస్సు భవిష్యత్తును నిర్దేశిస్తాయని ఆయన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఐకమ్, టీజీడెక్స్, ఏఐ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ద్వారా సుస్థిరత, పౌర కేంద్రిత పాలన, భాగస్వామ్య బాధ్యతలతో కూడిన ఆవిష్కరణలను తెలంగాణ అమలు చేస్తున్నదని మంత్రి తెలిపారు. గ్లోబల్ సహకారంతో అభివృద్ధి సాధించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

సమ్మిట్‌ సందర్భంగా ఇండోనేషియా కమ్యూనికేషన్స్ అండ్ డిజిటల్ వ్యవహారాల ఉపమంత్రిగా ఉన్న నేజర్ పాట్రియాతో కూడా మంత్రి సార్ధక చర్చలు జరిపారు. హైదరాబాద్, జకార్తా టెక్నాలజీ స్కిల్స్ డెవలప్‌మెంట్ కారిడార్ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు. ఈ కారిడార్ ద్వారా సాంకేతిక నైపుణ్యాల మార్పిడి, నైపుణ్యాభివృద్ధి వ్యవస్థల బలోపేతం, తెలంగాణ, ఇండోనేషియా స్టార్టప్, ఆవిష్కరణ పర్యావరణాల మధ్య సహకారం మరింతగా పెంపొందుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం మీద, బాధ్యతాయుత ఆవిష్కరణలు, గ్లోబల్ భాగస్వామ్యాలు, సుస్థిర విధానాల ఆధారంగా తెలంగాణను ఏఐ ఆధారిత అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి పేర్కొన్నారు.