Let's talk: editor@tmv.in
ఏఐలో భారత్‌ భవిష్యత్తు బ్లూప్రింట్‌ను చూస్తోంది: ప్రధాని మోడీ

ఏఐలో భారత్‌ భవిష్యత్తు బ్లూప్రింట్‌ను చూస్తోంది: ప్రధాని మోడీ

Pinjari Chand
20 ఫిబ్రవరి, 2026

కృత్రిమ మేధస్సు (ఏఐ)ను ప్రజాస్వామ్యీకరించి, సమగ్రత, సాధికారతకు సాధనంగా మార్చాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మనుషులు కేవలం డేటా పాయింట్లుగా లేదా ముడి సరుకులుగా మారకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ను ఉద్దేశించి గురువారం ఆయన మాట్లాడుతూ ఏఐకి విశాలమైన ఆకాశం ఇవ్వాలి. అయితే నియంత్రణల పట్టాలు మన చేతుల్లో ఉండాలన్నారు. ఏఐ ప్రపంచానికి మేలుచేయాలంటే అది పంచుకోవాల్సిందేనని, దాని కోడ్‌లు ఓపెన్‌గా ఉండాలని భారత్ నమ్ముతుందని పేర్కొన్నారు. అప్పుడు మాత్రమే లక్షలాది యువ మేధావులు దాన్ని మరింత మెరుగుపరచగలరని తెలిపారు.

ప్రపంచంలో ఏఐలో భయం చూసేవాళ్లు, అవకాశాలు చూసేవాళ్లు అనే రెండు వర్గాలు ఉన్నాయని మోడీ చెప్పారు. మేము భయాన్ని చూడం. భారత్ ఏఐలో అవకాశాన్ని చూస్తోంది. ఏఐలో భవిష్యత్తు చూస్తోంది. రేపటి బ్లూప్రింట్‌ను చూస్తోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ మానవ జనాభాలో ఆరవ వంతు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే దేశమని, ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభా, సాంకేతిక ప్రతిభ నిలయం కలిగిన దేశమని పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు మానవ చరిత్రలో ఒక విప్లవాత్మక అధ్యాయం. భారత్ ఏఐ విప్లవంలో భాగమే కాకుండా, దాన్ని నడిపిస్తూ, రూపుదిద్దుతోందని అన్నారు. భారత్ కేవలం సాంకేతికతను అభివృద్ధి చేయడమే కాకుండా, దాన్ని వేగంగా స్వీకరిస్తుందని చెప్పారు. యువత ఏఐను అద్భుతంగా స్వీకరిస్తోందని, సమ్మిట్ ప్రదర్శనకు భారీ స్పందన లభిస్తోందని తెలిపారు.

ఏఐ వల్ల వ్యవస్థలు మరింత స్మార్ట్‌గా, సమర్థవంతంగా మారుతాయని, సృజనాత్మక రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడతాయని మోడీ పేర్కొన్నారు. ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఇది గొప్ప అవకాశం అని చెప్పారు. బాలల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, పాఠ్యపుస్తకాలు ఎలా సరిచూసి రూపొందిస్తారో, అలాగే ఏఐ స్పేస్ కూడా పిల్లలకు భద్రంగా ఉండాలని సూచించారు.

సరికొత్త మార్పులకు దారితీసే శక్తి ఏఐకి ఉంది

మానవ చరిత్రలో కొన్ని మలుపులు శతాబ్దాల దిశను మార్చాయని, ఏఐ కూడా అలాంటి పరిణామాల్లో ఒకటని మోడీ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఏఐ ఏమి చేస్తుందన్నదే కాదు, ప్రస్తుతం మనం ఏఐతో ఏమి చేయగలమన్నదే అసలు ప్రశ్న అని చెప్పారు. ఏఐ సరికొత్త మార్పులకు దారితీసే శక్తి ఉందని, దాని లక్ష్యాల నుంచి దారి తప్పితే నాశనం కూడా తెచ్చిపెట్టగలదని హెచ్చరించారు. సరైన వినియోగంతో సమస్యలకు పరిష్కారాలు అందించగలదని చెప్పారు. కరెక్ట్ వాడుకుంటే అద్భుత ఫలితాలు ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరి సంక్షేమం, సంతోషమే ఏఐకు ప్రమాణం. మనుషులు కేవలం డేటా పాయింట్లుగా మారకుండా ఉండాలంటే ఏఐను ప్రజాస్వామ్యీకరించాల న్నారు. ఏఐ యంత్రాలను తెలివైనవిగా చేస్తూనే, మానవ సామర్థ్యాలను అనేక రెట్లు పెంచుతోందని తెలిపారు.

సమ్మిట్ థీమ్ అయిన ‘అందరికీ సంక్షేమం, సంతోషం’లోనే భారత్ దృష్టికోణం ప్రతిబింబిస్తుందని చెప్పారు. మెషీన్ లెర్నింగ్ నుంచి ‘లెర్నింగ్ మెషీన్’ దిశగా ప్రయాణం వేగంగా సాగుతోందని, భవిష్యత్ తరాలకు ఎలాంటి ఏఐ అందించబోతున్నామన్నది కూడా మన బాధ్యత అని తెలిపారు. ప్రత్యేకంగా గ్లోబల్ సౌత్ దేశాల్లో ఏఐను సమగ్రత, సాధికారత సాధనంగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు.

ఏఐ కోసం ‘MANAV’ (మానవ) అనే విజన్‌ను మోడీ ప్రతిపాదించారు. అందులో

• ఎం– నైతిక వ్యవస్థలు (మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్స్ ),

• ఏ– బాధ్యతాయుత పాలన (అకౌంటబుల్ గవర్నెన్స్),

• ఎన్ – జాతీయ సార్వభౌమత్వం (నేషనల్ సావర్నీటి),

• ఏ – అందుబాటు, సమగ్రత (యాక్సెసిబుల్ అండ్ ఇంక్లూజివ్),

• వీ – చట్టబద్ధత, న్యాయబద్ధత (వాలిడ్ అండ్ లెజిట్మెట్)లను సూచిస్తాయని వివరించారు.

సమ్మిట్‌లో మూడు భారతీయ కంపెనీలు తమ ఏఐ మోడళ్లను, అప్లికేషన్‌లను ఆవిష్కరించాయని, అవి యువత ప్రతిభను, భారత్ ప్రపంచానికి అందిస్తున్న పరిష్కారాలను ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. భారత్ మండపంలో జరిగిన ఈ సమ్మిట్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రన్ , బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా, శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయక, భూటాన్ ప్రధాని ట్షెరింగ్ టబ్గేతో పాటు మరికొంతమంది ప్రపంచ నాయకులు హాజరయ్యారు. అలాగే మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రంగూలమ్ , క్రొయేషియా ప్రధాని అండ్రేజ్ ప్లెన్కోవిక్ , సెర్బియా అధ్యక్షుడు అలెక్సాండర్ వుయిక్ , సెషెల్స్ ఉపాధ్యక్షుడు సెబాస్టియన్ పిల్లై , ఎస్టోనియా అధ్యక్షుడు అలర్ కరిస్, ఫిన్లాండ్ ప్రధాని పెట్టెరి ఒర్పో తదితరులు కూడా పాల్గొన్నారు.

ఏఐలో భారత్‌ భవిష్యత్తు బ్లూప్రింట్‌ను చూస్తోంది: ప్రధాని మోడీ - Tholi Paluku