
ఏఐతో ‘ఫేక్ తీర్పులు’..ట్రయల్ కోర్టుపై సుప్రీం ఆగ్రహం
కృత్రిమ మేధస్సు (ఏఐ) సహాయంతో రూపొందించిన, అసలు లేకున్నా(న్యాయ పుస్తకాల్లో, కోర్టు రికార్డుల్లో ఎక్కడా లేని తీర్పులు) ‘ఫేక్ తీర్పులను’ ఆధారంగా చేసుకుని ట్రయల్ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి తప్పుడు తీర్పులపై ఆధారపడి ఇచ్చే నిర్ణయం సాధారణ ‘తప్పిదం’ కాదని, అది నేరుగా అనుచిత ప్రవర్తన (మిస్‌కండక్ట్) కిందికి వస్తుందని స్పష్టం చేసింది. జస్టిస్ పి.ఎస్. నరసింహా, జస్టిస్ అలోక్ అరాధేలు సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ అంశాన్ని సవివరంగా పరిశీలించనున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలకు సోమవారం నోటీసులు జారీ చేసింది. సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్‌ను అమికస్ క్యూరీగా నియమించింది. ఏఐ ద్వారా సృష్టించిన, అసలు లేకుండానే తీర్పులను వినియోగించడం న్యాయవ్యవస్థ సమగ్రతపై నేరుగా ప్రభావం చూపుతుంది. అలాంటి తీర్పులపై ఆధారపడి తీసుకునే నిర్ణయం కేవలం నిర్ణయ ప్రక్రియలో పొరపాటు కాదు; అది తప్పిద ప్రవర్తనే అని ఫిబ్రవరి 27న ఇచ్చిన ఆదేశాల్లో ధర్మాసనం పేర్కొంది.
కేసు నేపథ్యం ఇలా...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. వివాదాస్పద ఆస్తి భౌతిక లక్షణాలను పరిశీలించేందుకు ట్రయల్ కోర్టు ఒక అడ్వకేట్ కమిషనర్‌ను నియమించింది. ఆ నివేదికపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా, ట్రయల్ కోర్టు వాటిని కొట్టివేస్తూ కొన్ని తీర్పులను ఆధారంగా చూపింది. అయితే ఆ తీర్పులు అసలు లేనివి, ఏఐ ద్వారా రూపొందించినవని పిటిషనర్లు ఆరోపించారు. హైకోర్టు కూడా ఈ అంశాన్ని గుర్తించి జాగ్రత్త సూచించినప్పటికీ, కేసును మెరిట్స్‌పై విచారించి ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని నిలబెట్టింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ దశలో సుప్రీంకోర్టు, స్పెషల్ లీవ్ పిటిషన్ తుది విచారణ పూర్తయ్యే వరకు అడ్వకేట్ కమిషనర్ నివేదిక ఆధారంగా ట్రయల్ కోర్టు తదుపరి చర్యలు చేపట్టకూడదని ఆదేశించింది. కేసు విచారణను మార్చి 10కు వాయిదా వేసింది.
‘ఏఐ పిటిషన్లు’పై సీజేఐ హెచ్చరిక
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 17న మరో కేసు విచారణలో ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ కూడా ఏఐ ద్వారా తయారైన, అసలు లేనివి అయిన తీర్పులను పిటిషన్లలో చేర్చుతున్న న్యాయవాదులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మెర్సీ వర్సెస్ మ్యాన్‌కైండ్ వంటి కల్పిత తీర్పులను ఉదాహరణగా చూపిస్తూ, ఇది ప్రమాదకర ధోరణి అని వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థలో సాంకేతికత వినియోగం అవసరమే అయినప్పటికీ, అది న్యాయపరమైన ప్రామాణికతను దెబ్బతీయకుండా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏఐ వినియోగంపై మార్గదర్శకాలు అవసరమా? బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలపై ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టి సారించింది.
