Let's talk: editor@tmv.in
‘ఏఐ’తో పాలన మరింత వేగవంతం చేయండి: సీఎం

‘ఏఐ’తో పాలన మరింత వేగవంతం చేయండి: సీఎం

Panthagani Anusha
28 జనవరి, 2026

పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే లక్ష్యంతో 2026వ సంవత్సరాన్ని సాంకేతికత ఆధారిత నిర్ణయాల సంవత్సరంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజిఎస్) పనితీరుపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం ఎదుర్కొంటున్న పనిభారాన్ని తగ్గించడంతో పాటు, ప్రజలకు అందించే సేవల నాణ్యతను పెంచడానికి సాంకేతికతే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. డిజిటల్ సాధనాలను వినియోగించడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని ప్రతి నిర్ణయం డేటా ఆధారంగానే తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

పాలనలో ఎదురయ్యే క్లిష్టమైన సమస్యలకు ఆధునిక సాంకేతిక పరిష్కారాలను అన్వేషించాలని సీఎం సూచించారు. ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని అన్ని శాఖల్లో విస్తృతం చేయాలని తద్వారా ప్రజా ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా పనితీరులో లోపాలున్న సిబ్బందిని గుర్తించి వారికి తగిన శిక్షణ అందించాలని బాధ్యతాయుతమైన పాలన అందించడంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులు, సిబ్బంది తమ దైనందిన విధుల్లో డిజిటల్ పరికరాలను విధిగా వాడేలా ప్రోత్సహించాలని, దీనివల్ల వేగవంతమైన సేవలు అందించడం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకే చేరవేస్తున్న ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ వ్యవస్థపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రస్తుతం ఈ వ్యవస్థ ద్వారా 868 నుండి 878 రకాల సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని అధికారులు ఈ సందర్భంగా వివరించారు. ఇప్పటివరకు దాదాపు 1.43 కోట్ల మంది ఈ మెసేజింగ్ సేవలను వినియోగించుకోవడంపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. డిజిటల్ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి ఇది నిదర్శనమని ఈ సేవలను మరింత సరళతరం చేయాలని అధికారులను కోరారు.

చివరగా వ్యవసాయం, రెవెన్యూ, వైద్యారోగ్యం, రవాణా, అగ్నిమాపక వంటి కీలక శాఖల పనితీరును సీఎం సమీక్షించారు. ప్రతి శాఖలోనూ సాంకేతిక సమన్వయాన్ని పెంచి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణ సేవలు అందించాలని ఆదేశించారు. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో సాంకేతికతను వాడుకుంటూ తక్కువ సమయంలోనే మెరుగైన ఫలితాలు సాధించడమే తన లక్ష్యమని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.