
ఏఎస్ రావు నగర్ బస్తీ దవాఖాన విస్తరణకు ఉప్పల్ ఎమ్మెల్యే శంకుస్థాపన
స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా డా. ఏఎస్ రావు నగర్‌లోని బస్తీ దవాఖాన భవన విస్తరణ పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ విస్తరణ పూర్తయితే ఈ ప్రాంత వాసులకు మరింత సౌకర్యవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇదే బస్తీ దవాఖానతో పాటు రామంతాపూర్, వెంకట్ రెడ్డి నగర్ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేసింది. మొత్తం రూ. 8.36 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 15 రకాల అభివృద్ధి పనులకు సంబంధించి ఎమ్మెల్యే వివరాలను వెల్లడించారు.డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం మరియు బాక్స్ డ్రెయిన్‌లు, అంతర్గత సిసి రోడ్ల నిర్మాణం, కమ్యూనిటీ సదుపాయాల కల్పన, శ్మశాన వాటికల అభివృద్ధికి ఈ నిధుల మంజూరుకు సహకరించిన మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి, ఈ పనులు సాధించడానికి ప్రత్యేక కృషి చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనతో కాలనీల రూపురేఖలు మారుతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్. సోమశేఖర్ రెడ్డి, సీపీఐ నాయకుడు బోస్, వైద్యులు డా. సత్యవతి కె.తదితరులు పాల్గొన్నారు.
