
ఏఎన్‌యూ ఇంజనీరింగ్ కళాశాలకు వైఎస్సార్ పేరు పునరుద్ధరించాలి: అంబటి మురళీకృష్ణ
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ (ఏఎన్‌యూ) ఆవరణలోని ఇంజనీరింగ్ కళాశాలకు ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును వర్సిటీ అధికారులు అధికారికంగా తొలగించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆదివారం వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం ఇన్ఛార్జి ఉపకులపతి (వీసీ) ఆచార్య గంగాధరమ్‌కు వినతిపత్రం అందజేశారు.
అక్రమంగా తొలగించారు: అంబటి మురళీకృష్ణ
ఈ సందర్భంగా అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఇంజనీరింగ్ కళాశాల పేరు నుంచి వైఎస్సార్ పేరును తొలగించడం దుర్మార్గమన్నారు. ఇన్చార్జి వీసీకి ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని ఆయన స్పష్టం చేశారు. వినతిపత్రం అందజేయడానికి వచ్చిన తనను టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అడ్డుకోవడం వర్సిటీ గేట్లు మూసివేసి దౌర్జన్యానికి దిగడంపై ఆయన మండిపడ్డారు. పోలీసుల సహకారంతో వీసీ కార్యాలయానికి వెళ్లినప్పటికీ లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడం వర్సిటీలో నెలకొన్న రాజకీయ వాతావరణానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. తన కారుపై కూడా దాడికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.
గత కొంతకాలంగా విద్యా సంస్థలకు రాజకీయ నాయకుల పేర్లు ఉండకూడదని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్ఎస్ఎఫ్) నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ, ఇటీవల ఇన్ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్‌కు వారు మరోసారి వినతిపత్రం ఇవ్వడంతో అధికార యంత్రాంగం పేరు తొలగింపు ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే కళాశాల పేరు నుంచి వైఎస్సార్ పేరును తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
2029లో మళ్లీ పునరుద్ధరిస్తాం
ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని మురళీకృష్ణ విమర్శించారు. "2029లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే వర్సిటీలో తొలగించిన వైఎస్సార్ విగ్రహాన్ని పునరుద్ధరించడంతో పాటు ఇంజనీరింగ్ కళాశాలకు ఆయన పేరును తిరిగి అమలు చేస్తాం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వైకాపా అనుబంధ విభాగాల నేతలు, విద్యార్థి సంఘం ప్రతినిధులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
