
ఎస్సీల సంక్షేమమే ధ్యేయం.. పేదరికం లేని సమాజమే లక్ష్యం
రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) అభ్యున్నతి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ పరమావధి అని పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి పునరుద్ఘాటించారు. సోమవారం శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో మంత్రి సుదీర్ఘంగా ప్రసంగించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖకు రూ.11,118 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద గత ఏడాది కంటే రూ.362 కోట్లు అధికంగా మొత్తం రూ.20,643.57 కోట్లు కేటాయించి దళిత సాధికారతకు బాటలు వేశామని పేర్కొన్నారు.
విద్యా రంగానికి పెద్దపీట.. విదేశీ ఉపాధిపై దృష్టి
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విద్యా రంగానికి భారీగా నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. వసతి గృహాల నిర్మాణానికి రూ.581 కోట్లు, ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాలకు రూ.389 కోట్లు, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు రూ.323 కోట్లు కేటాయించినట్లు వివరించారు. కేవలం నిధులు ఇవ్వడమే కాకుండా విద్యార్థులకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 150 మంది నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాషలో ఉచిత శిక్షణ ఇచ్చి, అనంతరం జర్మనీలో ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా అంబేద్కర్ గురుకులాల్లో ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లను 10కి పెంచడంతో ఈ ఏడాది 161 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ కనబరిచారని హర్షం వ్యక్తం చేశారు.
కాగా గత ప్రభుత్వ హయాంలో శిథిలావస్థకు చేరిన ఎస్సీ హాస్టళ్లను కూటమి ప్రభుత్వం బాగు చేసిందని మంత్రి విమర్శించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.143 కోట్లతో 783 హాస్టళ్లకు మరమ్మతులు చేయించామని, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా రూ.55 కోట్లతో అదనపు టాయిలెట్లు నిర్మించినట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక మహిళా వైద్యాధికారిని నియమించామని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కార్పొరేట్ చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
అదేవిధంగా నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు 340 మందికి సివిల్స్, 140 మందికి ఎస్సెస్సీ, ఆర్ఆర్‌బీ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. డీఎస్సీ ఉచిత కోచింగ్ వల్ల ఇప్పటికే 300 మంది ఉపాధ్యాయులుగా ఎంపికైనట్లు ఈసందర్బంగా పేర్కొన్నారు.దీనికితోడు గత ప్రభుత్వ పాలనలో నిర్వీర్యమైన లిడ్ క్యాప్)ను పునరుద్ధరిస్తూ ప్రకాశం జిల్లా యడవల్లి, కృష్ణా జిల్లా జీ.కొండూరులో రూ.11.5 కోట్లతో ఫుట్‌వేర్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
