Let's talk: editor@tmv.in
ఎస్‌బీఐ సరికొత్త రికార్డు: క్యూ3లో రూ. 21,028 కోట్ల లాభం

ఎస్‌బీఐ సరికొత్త రికార్డు: క్యూ3లో రూ. 21,028 కోట్ల లాభం

Dantu Vijaya Lakshmi Prasanna
8 ఫిబ్రవరి, 2026

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో (Q3) అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ 31తో ముగిసిన ఈ త్రైమాసికంలో బ్యాంక్ స్టాండ్ అలోన్ ప్రాతిపదికన రూ. 21,028 కోట్ల నికర లాభాన్ని ఆర్జించి, తన చరిత్రలోనే సరికొత్త రికార్డును సృష్టించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే కన్సాలిడేటెడ్ లాభం కూడా 13.06 శాతం పెరిగి రూ. 21,317 కోట్లకు చేరుకున్నట్లు బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

బ్యాంక్ ప్రధాన వడ్డీ ఆదాయం గణనీయంగా మెరుగుపడటం ఈ లాభాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గతేడాది రూ. 41,446 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం, ఈ ఏడాది 9.04 శాతం వృద్ధి చెంది రూ. 45,190 కోట్లకు చేరింది. బ్యాంక్ మొత్తం రుణ వితరణలో 15.14 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. అయితే, దేశీయ నికర వడ్డీ మార్జిన్‌లో స్వల్పంగా 0.03 శాతం తగ్గుదల కనిపించి 3.12 శాతం వద్ద నిలిచింది.

వడ్డీయేతర ఆదాయం కూడా ఈ త్రైమాసికంలో బ్యాంక్‌కు మంచి ఊతాన్ని ఇచ్చింది. ఫీజుల రూపంలో వచ్చే ఆదాయం ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయం 15.65 శాతం పెరిగి రూ. 8,404 కోట్లుగా నమోదైంది. అదే సమయంలో బ్యాంక్ డిపాజిట్ల వృద్ధి 9.02 శాతంగా ఉంది. ఇక ఖర్చుల విషయానికి వస్తే, గత క్యూ3లో రూ. 1,04,917 కోట్లుగా ఉన్న మొత్తం వ్యయాలు, ఈ త్రైమాసికంలో రూ. 1,08,052 కోట్లకు పెరిగాయి.

ఆస్తి నాణ్యత విషయంలో ఎస్‌బీఐ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. సెప్టెంబర్ త్రైమాసికంలో 1.73 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు, డిసెంబర్ చివరి నాటికి 1.57 శాతానికి తగ్గాయి. అయితే, కొత్తగా వచ్చిన స్లిప్పేజీలు రూ.4,458 కోట్లుగా ఉన్నాయి. ప్రొవిజన్ల కేటాయింపులు గతేడాది రూ. 911 కోట్లతో పోలిస్తే ఈసారి రూ. 4,507 కోట్లకు పెరగడం గమనార్హం.

ఈ ఫలితాల అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌బీఐ ఛైర్మన్ సి.ఎస్. శెట్టి మాట్లాడుతూ, ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ నుండి వచ్చిన రూ. 2,200 కోట్ల ప్రత్యేక డివిడెండ్ ఈ లాభాల వృద్ధికి తోడ్పడిందని వివరించారు. దీనితో పాటు ఫీజు ఆదాయం పెరగడం, గతంలో రైటాఫ్ చేసిన ఖాతాల నుండి రికవరీలు రావడం కూడా బ్యాంక్ లాభదాయకతను పెంచాయన్నారు. ప్రస్తుతం బ్యాంక్ మూలధన పర్యాప్తత నిష్పత్తి 14.04 శాతంగా ఉంది అని అన్నారు.