
ఎస్పీ, కాంగ్రెస్‌పై మాయావతి విమర్శలు
బహుజన సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ) వ్యవస్థాపకుడు దివంగత కాన్షీరాం వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 9న లక్నోలోని స్మారక్ స్థల్ లో బెహన్ జీ మాయావతి నాయకత్వంలో బీఎస్పీ భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తోంది. అయితే ఈ సభకు పోటీగా కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు కూడా ర్యాలీలు, సభలు నిర్వహిస్తామని ప్రకటించాయి. దీంతో మాయవతి ఆ పార్టీలపై మంగళవారం తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ పార్టీలు నిర్వహించే సభలను మోసపూరితమైనవిగా, కులతత్వ, దురుద్దేశ పూరిత సభలుగా ఆమె వర్ణించారు.
కోట్లాది మంది గొంతుక కాన్షీరాం
బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ చేపట్టిన ఆత్మగౌరవ ఉద్యమాన్ని కొనసాగిస్తూ, దేశంలోని దళితులు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన వర్గాలను ముందుండి నడిపించి వారిని పాలకులుగా మార్చడానికి కృషి చేసిన వ్యక్తి కాన్షీరాం అని, కోట్లాది మంది అణగారిన వర్గాల గొంతుక ఆయన అని మాయావతి కొనియాడారు. వెనుకబడ్డ వర్గాల ఆత్మగౌరవం కోసం నిరంతరం శ్రమించిన మహానీయుడని ప్రశంసించారు. కానీ విపక్షాలు ముఖ్యంగా ఎస్పీ, కాంగ్రెస్ ఆయన పట్ల ద్వేషపూరిత వైఖరిని ప్రదర్శించారని, వారు ఎప్పుడూ కులతత్వంతో వ్యహరించారని ఆమె గుర్తు చేశారు. అయితే అక్టోబర్ 9న పరినిర్వాణ్ దివస్ సందర్భంగా ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు సభలు, ర్యాలీలు, సదస్సులు నిర్వహించడాన్ని ఒక పెద్దమోసం అని విమర్శించారు. కడుపులో కత్తులు పెట్టుకుని, కౌగిలించుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
కాన్షీరాం నగర్ పేరు మార్పు మీద విమర్శలు
ఏప్రిల్ 17, 2008లో అధికారంలో ఉన్న మాయావతి ప్రభుత్వం కాన్షీరాం పేరుతో అలీగఢ్ డివిజన్ లో కాన్షీరాం నగర్ అనే జిల్లాను ఏర్పాటు చేశారు. కానీ 2012లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎస్పీ ప్రభుత్వం కాస్గంజ్ గా జిల్లా పేరును మార్చింది. ఇది కాన్షీరాం చేపట్టిన ఉద్యమాన్ని బలహీనపరిచే కుట్రలో భాగంగానే ఈ విధంగా ఆయా పార్టీలు వ్యవహరించాయని ఆమె గుర్తు చేశారు. అలాగే కాన్షీరాం పేరు మీద ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఆసుపత్రులు మొదలైన వాటి పేర్లను ఎస్పీ ప్రభుత్వం మార్చిందని మాయావతి ఆరోపించారు. ఇది దళిత వ్యతిరేక రాజకీయ ధోరణికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఆయన జీవితకాలంలో నిత్యం ఆయన చేపట్టిన ఉద్యమాలను ఎస్పీ అవహేళన చేసిందని, వాటిని బలహీన పరిచేందుకు శతవిధాల ప్రయత్నించిందని ఆమె తెలిపారు. ఆయనకు ఎప్పుడూ ద్రోహమే తలపెట్టిందని, రాజకీయ దురుద్దేశాలతో జిల్లా పేరును కూడా మార్చిందని వివరించారు. ఈ విధంగా దళిత వ్యతిరేక వ్యూహాలను అమలు చేసిన కాంగ్రెస్, ఎస్పీలు ఇప్పుడు ఆయనకు నివాళులర్పిస్తామంటే ఎవరు విశ్వసిస్తారు?
సంతాప దినం కూడ ప్రకటించలేదు
2006లో బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం మరణించినప్పుడు ఎస్పీ కనీసం రాష్ట్ర సంతాప దినాన్ని కూడా ప్రకటించలేదని, దేశం, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మొత్తం దు:ఖంలో మునిగిపోయివుంటే ఎస్పీ ప్రభుత్వం ఒక్కరోజూ కూడా సంతాప దినం ప్రకటించలేదు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయన మరణించినప్పుడు ఒక్కరోజు కూడా జాతీయ సంతాప దినాన్ని ప్రకటించలేదని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ ఓటు బ్యాంక్ రాజకీయాలతో, సంకుచిత ప్రయోజనాల కోసం ఎస్పీ, కాంగ్రెస్ కాన్షీరాంను స్మరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఇది కేవలం కపటం, మోసం తప్పా మరేమీకాదన్నారు. ఇటువంటి పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
