Let's talk: editor@tmv.in
ఎస్‌డీపీఐతో ఒప్పందం ఆరోపణలు అసత్యం: పినరయ్‌ విజయన్

ఎస్‌డీపీఐతో ఒప్పందం ఆరోపణలు అసత్యం: పినరయ్‌ విజయన్

Pinjari Chand
30 మార్చి, 2026

రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీఎం–ఎస్‌డీపీఐ మధ్య ఒప్పందం ఉందన్న ఆరోపణలను కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ పూర్తిగా ఖండించారు. ఈ ఆరోపణలు ‘నిరాధారమైనవి’ అని పేర్కొంటూ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ రాజకీయ లాభం కోసం ఇలాంటి ప్రచారం చేస్తోందని విమర్శించారు. తిరూర్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, ఎల్‌డీఎఫ్ ఎప్పుడూ మతవాదానికి వ్యతిరేకంగా కట్టుదిట్టమైన వైఖరి పాటించిందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం గిమ్మిక్స్ వల్ల కాదు, పనితీరుతోనే మళ్లీ అధికారంలోకి వచ్చిందని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన అనుభవంతో చెప్పగలిగేది ఏమిటంటే, ఈసారి ఎల్‌డీఎఫ్‌కు అనుకూలంగా బలమైన ప్రజా తరంగం కనిపిస్తోందని విజయన్ పేర్కొన్నారు. గత దశాబ్దంలో అభివృద్ధి, సామాజిక భద్రత రంగాల్లో సాధించిన పురోగతే తమకు మద్దతుగా మారిందని అన్నారు. సాధారణ ప్రజల ప్రయోజనాలను కాపాడుతూ మౌలిక వసతులను అభివృద్ధి చేయడం—ఇదే ‘కేరళ మోడల్’” అని ఆయన చెప్పారు. ఎస్‌డీపీఐ మద్దతు అంశంపై ప్రశ్నించగా మతవాదం ఏ రంగులో ఉన్నా అది సమాజానికి ప్రమాదకరం. ఎల్‌డీఎఫ్ ఎప్పుడూ అలాంటి శక్తులతో రాజీపడదని ఆయన స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో కేరళలో ఒక్క మత ఘర్షణ కూడా జరగకపోవడం తమ ప్రభుత్వ విధానాల ఫలితమని తెలిపారు.

అదేవిధంగా ఆర్‌ఎస్‌ఎస్, యూడీఎఫ్ మధ్య కొన్ని నియోజకవర్గాల్లో అవగాహన ఉందని ఆయన ఆరోపించారు. బీజేపీ బలహీనంగా ఉన్న చోట యూడీఎఫ్‌కు ఓటేయాలని ఆర్‌ఎస్‌ఎస్ తన కేడర్‌కు సూచించిందని అన్నారు. ఈ ‘కో-లే-బి’ (కాంగ్రెస్-లీగ్-బీజేపీ) కలయిక కొత్త విషయం కాదని వ్యాఖ్యానించారు. హర్యానాలో జరిగిన ‘క్యాష్ ఫర్ సీట్స్’ ఆరోపణలపై స్పందిస్తూ కాంగ్రెస్ జాతీయ నాయకత్వం మౌనం పాటించడం అనుమానాలకు తావిస్తోంది అని అన్నారు. అభ్యర్థిత్వం కూడా అమ్మకానికి వస్తోందన్న ఆరోపణలపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రవాసుల కోసం సంక్షేమ నిధిని తీసుకొచ్చాం

ప్రవాస కేరళీయుల సంక్షేమంపై కూడా ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. ఎల్‌డీఎఫ్ ప్రభుత్వమే దేశంలో తొలిసారిగా ప్రవాసుల కోసం సంక్షేమ నిధిని ప్రవేశపెట్టిందని, నోర్కా వంటి సంస్థలను ఏర్పాటు చేసి వారికి సహాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రవాస సంక్షేమ నిధి సభ్యుల సంఖ్య 7.9 లక్షలకు పెరిగిందని చెప్పారు. యువతకు అవకాశాలు కల్పించడం, ఆరోగ్య రంగంలో పురోగతి, విద్యా సంస్కరణలు వంటి అంశాల్లో తమ ప్రభుత్వం గణనీయమైన మార్పులు తీసుకువచ్చిందని విజయన్ పేర్కొన్నారు. ఇక నీలాంబూర్ ఎమ్మెల్యే పీవీ అన్వర్ వ్యవహారంపై మాట్లాడుతూ, ఆయన చర్య ప్రజా తీర్పుకు ద్రోహమని విమర్శించారు. ఇంతకాలం విమర్శించిన కాంగ్రెస్‌తో ఇప్పుడు కలిసి పనిచేయడం అవకాశవాదమని అన్నారు. ఏప్రిల్ 9న జరగనున్న ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌కు భారీ మెజారిటీ లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తమ పనితీరును గుర్తించి మళ్లీ అధికారంలోకి తీసుకువస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.