Let's talk: editor@tmv.in
ఎస్‌.ఐ.ఆర్‌ వెనుక కుట్ర: ఉదయనిధి స్టాలిన్‌

ఎస్‌.ఐ.ఆర్‌ వెనుక కుట్ర: ఉదయనిధి స్టాలిన్‌

Pinjari Chand
3 నవంబర్, 2025

తమిళనాడులో అధికారాన్ని చేజిక్కించుకునేందుకే స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌.ఐ.ఆర్‌)ను ఉద్దేశపూర్వకంగా అమలు చేస్తున్నారని తమిళనాడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఆదివారం ఈసీ, బీజేపీని తీవ్రంగా విమర్శించారు. పన్నెండు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకొని రెండో విడత ఎస్‌.ఐ.ఆర్‌ ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో, దీనిపై తమ పార్టీ తీవ్ర వ్యతిరేకతను మరోసారి వ్యక్తం చేశారు.

‘బీహార్‌ ఎన్నికల్లో వాళ్లు ఏం చేశారో మనందరికీ తెలుసు. సుప్రీంకోర్టు కూడా కొన్ని ముఖ్యమైన తీర్పులు ఇచ్చింది. మరో మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న వేళ, తమిళనాడులో అధికారంలోకి వచ్చేందుకే ఈ ఎస్‌.ఐ.ఆర్‌ పేరుతో చర్యలు తీసుకుంటున్నారు అని ఆయన అన్నారు.

ఇదే అంశంపై సీఎం ఎం.కే. స్టాలిన్‌ అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారని, అందుకు ప్రతిపక్ష నేతలందరికీ ఆహ్వానం పంపినట్లు ఉదయనిధి తెలిపారు. వారి అభిప్రాయాలు వినిపించనివ్వండి, ఆ తర్వాత మా నేత మంచి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పారు.

ఉదయనిధి నాపియర్‌ బ్రిడ్జ్‌ వద్ద జెండా ఊపి ‘చెన్నై రన్స్‌ 2025’ మారథాన్‌ పోటీలను ప్రారంభించారు. ‘మద్రాస్‌ రౌండ్‌ టేబుల్‌–1 (ఎం.ఆర్‌.టి.1)’ ఆధ్వర్యంలో జరిగిన ఈ నాలుగో ఎడిషన్‌ మారథాన్‌లో 10 వేలమంది క్రీడాకారులు, పౌరులు పాల్గొన్నారు. 21.1 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల విభాగాల్లో పోటీలు నిర్వహించారు. రన్నర్స్‌తో మాట్లాడిన ఉపముఖ్యమంత్రి, వారి ఉత్సాహాన్ని ప్రశంసిస్తూ ముందుకు సాగండి అంటూ ప్రోత్సహించారు. కార్యక్రమ విజయానికి తోడ్పడిన వాలంటీర్లు, పోలీసు అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు కమల్‌ హాసన్‌ ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.