
ఎస్‌ఐఆర్ విచారణకు మాజీ ఫుట్‌బాలర్ మెహతాబ్ హుస్సేన్
భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మాజీ ఫుట్‌బాలర్ మెహతాబ్ హుస్సేన్‌ను పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా విచారణకు హాజరుకావాలని ఎన్నికల అధికారులు సమన్లు జారీ చేశారు. మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ అనే కోల్కతా రెండు ప్రముఖ క్లబ్బులకు కెప్టెన్‌గా వ్యవహరించిన అరుదైన గౌరవం పొందిన మెహతాబ్ హుస్సేన్, తనకు వచ్చిన నోటీసుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
భారత జట్టుకు సుమారు 30కి పైగా మ్యాచ్‌లు ఆడిన హుస్సేన్‌కు, ఫిబ్రవరి 1న దక్షిణ 24 పరగణాల జిల్లా మల్లిక్‌పూర్‌లోని ఒక పాఠశాలలో విచారణకు హాజరుకావాలని నోటీసు అందింది. ప్రస్తుతం కోల్కతా సమీపంలోని న్యూ టౌన్‌లో నివసిస్తున్నప్పటికీ, మల్లిక్‌పూర్ ఆయన స్వగ్రామం కావడంతో అక్కడే ఆయన ఓటరుగా నమోదు అయ్యారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం, ఆయన తల్లి సంబంధిత పత్రాల్లో ఉన్న కొన్ని వ్యత్యాసాల కారణంగా ఈ నోటీసు జారీ అయింది.
ఈ సందర్భంగా మెహతాబ్ మాట్లాడుతూ జాతీయ జెర్సీ ధరించి దేశానికి చెమట, రక్తం అర్పించాను. అయినా నేను భారతీయుడిననే విషయం నిరూపించుకోవడానికి క్యూలో నిలబడాలా? మా సేవలకు విలువ లేదా? అని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తనకే కాదు, వృద్ధులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారు కూడా వీల్‌చైర్‌లలో వచ్చి క్యూల్లో నిలబడాల్సి వస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పౌరసత్వ నిర్ధారణకు ప్రత్యామ్నాయ విధానాలు ఆలోచించాలని అధికారులను కోరారు. ప్రస్తుతం మెహతాబ్ హుస్సేన్ సుందర్‌బన్ ఆటో ఎఫ్‌సీ జట్టు కోచ్‌గా పనిచేస్తున్నారు. ఈ జట్టు బెంగాల్ సూపర్ లీగ్ సెమీఫైనల్‌కు సిద్ధమవుతోంది. ఇంతకుముందు భారత క్రికెటర్ మహ్మద్ షమీ, మాజీ క్రికెటర్ బెంగాల్ రంజీ మాజీ కెప్టెన్ లక్ష్మీ రతన్ శుక్లా తదితర ప్రముఖ క్రీడాకారులను కూడా ఎస్‌ఐఆర్ విచారణకు పిలిచిన విషయం తెలిసిందే.
