Let's talk: editor@tmv.in
ఎస్ఐఆర్ రెండో దశ ప్రారంభం

ఎస్ఐఆర్ రెండో దశ ప్రారంభం

Pinjari Chand
5 నవంబర్, 2025

దేశంలోని ఆయా పార్టీలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ను వ్యతిరేకిస్తున్నప్పటికి సర్ రెండో దశ కార్యక్రమం ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక విస్తృత ఓటరు జాబితా సవరణ (సర్) రెండో దశ మంగళవారం ప్రారంభమైంది. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు) ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు (ఓటరు నమోదు ఫారాలు) పంపిణీ చేస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లోని రష్‌బెహారి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బిఎల్ఓ రాజేష్ సింగ్ మాట్లాడుతూ ఒక నెలలోపుగా ఫారాల పంపిణీ, సేకరణ పూర్తి చేయాలని సూచనలు వచ్చాయని అన్నారు.

ఈపీఐసీ నంబర్ వివరాలు నమోదు చేస్తే చాలు: కలెక్టర్ అనూ కుమారి

దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రత్యేక విస్తృత ఓటరు జాబితా సవరణ రెండో దశ కేరళలో కూడా ప్రారంభమైందని తిరువనంతపురం జిల్లా కలెక్టర్ అనూ కుమారి తెలిపారు. ఆమె వివరించిన ప్రకారం ఓటర్ల పేరు, ఈపీఐసీ నంబర్, ఫోటో వంటి వివరాలు ఇప్పటికే ఫారంలో ముద్రించబడి ఉంటాయి. ఓటరు జన్మతేది, మొబైల్ నంబర్ వంటి సులభమైన వివరాలను మాత్రమే నింపాలి. ఈ దశలో అత్యంత ముఖ్యమైన అంశం 2025 ఓటరు జాబితాను 2002 జాబితాతో లింక్ చేయడమన్నారు. 2002 జాబితాలో పేర్లు ఉన్నవారు తమ ఈపీఐసీ నంబర్ వివరాలు నమోదు చేస్తే చాలు వారికి పత్రాలు సమర్పించే అవసరం ఉండదని ఆమె చెప్పారు. అయితే జాబితాలో లేని వారు, అలాగే వారి బంధువులు (తల్లిదండ్రులు, మామలు, సోదరులు) కూడా లేని వారు పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి వారికి నోటీసులు జారీ చేసి, పత్రాలు సమర్పించేందుకు సమయం ఇస్తాం. ఆ తర్వాత బీఎల్ఓ భౌతికంగా ధృవీకరణ చేస్తారు. తుది నిర్ణయం ఈఆర్ఓ తీసుకుంటారని కలెక్టర్ వివరించారు. తమ వార్డులో లేని వారు తల్లిదండ్రులు లేదా బంధువుల ద్వారా ఫారం నింపించి పంపించవచ్చు. వారు అదే ఇంట్లో ఉంటే సరిపోతుంది. లేకపోతే, ఆన్‌లైన్‌లో ఫారం నింపి సమర్పించవచ్చు అని చెప్పారు.

తమిళనాడులో తూత్తుకుడి జిల్లా కలెక్టర్ కె. ఇలంబగవత్ నగర ప్రాంతాల్లో ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సర్వే అండమాన్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో జరగనుంది.

ఎన్నికల సంఘం అక్టోబర్ 27న రెండో దశ షెడ్యూల్‌ను ప్రకటించింది. దాని ప్రకారం

• అక్టోబర్ 28–నవంబర్ 3: ప్రింటింగ్, శిక్షణ దశ

• నవంబర్ 4–డిసెంబర్ 4: ఫారాల సేకరణ (ఎన్యూమరేషన్) దశ

• డిసెంబర్ 9: డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల

• డిసెంబర్ 9–జనవరి 8: క్లెయిమ్స్, ఆబ్జెక్షన్లు

• జనవరి 9–31: విచారణ, ధృవీకరణ

• ఫిబ్రవరి 7, 2026: తుది ఓటరు జాబితా విడుదల

మొదటి దశ అనుభవాన్ని బట్టి, ఈసారి బిఎల్ఓలు ఒక్కో ఇంటిని మూడుసార్లు సందర్శించాలని నిర్ణయించారు.ఆన్‌లైన్‌లో కూడా ఓటరు దరఖాస్తు ఫారాలు ఇచ్చే అవకాశం కల్పించింది. 2003 ఓటరు జాబితాలో పేర్లు లేకపోయినా సంబంధిత పత్రాల ఆధారంగా అర్హత నిర్ధారిస్తామని ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. అయితే ఈ ప్రక్రియకు పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు వ్యతిరేకంగా నిలిచాయి. టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ అర్హుడైన ఒక్క ఓటరును తొలగించినా ఢిల్లీ వరకు పోరాటాన్ని తీసుకెళ్తామని హెచ్చరించారు. ఇప్పటికే తమిళనాడు డీఎంకే పార్టీ అక్టోబర్ 27 నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఎస్ఐఆర్ రెండో దశ ప్రారంభం - Tholi Paluku