Let's talk: editor@tmv.in
ఎస్‌ఐఆర్ ఫారాలను జూలై 20 లోపే సమర్పించండి: ఓటర్లకు అసదుద్దీన్ పిలుపు

ఎస్‌ఐఆర్ ఫారాలను జూలై 20 లోపే సమర్పించండి: ఓటర్లకు అసదుద్దీన్ పిలుపు

Gaddamidi Naveen
16 జులై, 2026

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలను గడువు తేదీకి ముందుగానే సమర్పించాలని ఎంఐఎం అధ్యక్షుడు, హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓటర్లకు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఈ ప్రక్రియ పౌరసత్వానికి సంబంధించిన అంశాలతో ముడిపడి ఉందని పేర్కొన్నారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఓటర్లకు సహాయం అందించేందుకు హైదరాబాద్‌కు చెందిన ముస్లిం యువత సహకారంతో ఎంఐఎం ప్రత్యేక యాప్‌ను రూపొందించిందని ఓవైసీ తెలిపారు. ఫారాలు పూరించడం, అవసరమైన వివరాలు నమోదు చేయడం సులభంగా ఉండేలా ఈ యాప్‌ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి సమర్పించేందుకు పార్టీ తరఫున సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు.

జూలై 24 వరకు ఫారాల సమర్పణకు గడువు ఉన్నప్పటికీ, వీలైనంత త్వరగా, ముఖ్యంగా జూలై 20లోపు ఫారాలు అందజేయాలని ఆయన సూచించారు. చివరి రోజుల్లో పెద్ద సంఖ్యలో ఫారాలు రావడం వల్ల బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) వాటిని ఎన్నికల సంఘం వ్యవస్థలో అప్‌లోడ్ చేయడంలో ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ కోసం ఇంటింటి సర్వే, ఎన్యూమరేషన్ ప్రక్రియ జూన్ 25న ప్రారంభమై జూలై 24 వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఓటర్లు అప్రమత్తంగా ఉండి తమ వివరాలను సక్రమంగా నమోదు చేయించుకోవాలని ఓవైసీ కోరారు.

ఈ సందర్భంగా మత తీవ్రవాదంపై జరుగుతున్న చర్చలను కూడా ఆయన ప్రస్తావించారు. మతాన్ని అనుసరించడం లేదా మతాచారాలను పాటించడం తీవ్రవాదంగా ఎలా పరిగణించవచ్చని ప్రశ్నించారు. మరోవైపు గుంపుల దాడులు, మాబ్ లించింగ్‌లు, . రైళ్లలో గడ్డం ఉన్న వ్యక్తులపై దాడులు వంటి ఘటనలను నిజమైన తీవ్రవాద లక్షణాలుగా పేర్కొన్నారు. ముస్లింలు ఎన్నడూ మత తీవ్రవాదం వైపు వెళ్లరని, అలా వెళ్లే వారికి అసలు మతంతోనే సంబంధం ఉండదని స్పష్టం చేశారు. అలాగే మసీదుల ధ్వంసం, రూపాంతరాలు తీవ్రవాదం కిందకు రావా? అని ప్రశ్నించారు. అలాగే ప్రస్తుత వర్షాకాలంలో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జూలై 26న వర్షాల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు ఓవైసీ వెల్లడించారు.

ట్యాగ్‌లు
AIMIMAsaduddinOwaisiSalarEMillatEducationForAllStudentSupportEducationalKitsUrduMediumSchoolsSchoolEducationSSCStudentsHyderabad
ఎస్‌ఐఆర్ ఫారాలను జూలై 20 లోపే సమర్పించండి: ఓటర్లకు అసదుద్దీన్ పిలుపు - Tholi Paluku