
ఎస్ఐఆర్ పేరుతో ఎన్ఆర్సీని పరోక్షంగా అమలు చేస్తున్నారు: ఒవైసీ
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ద్వారా జరుగుతున్న ఓటరు జాబితాల పరిశీలన ఏ మాత్రం పారదర్శకంగా లేదని, ఇది ఎస్ఐఆర్ పేరుతో ఎన్ఆర్సీని పరోక్షంగా తీసుకొచ్చారని ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లోక్‌సభలో తీవ్రంగా విమర్శించారు. మత ప్రాతిపదికన వివక్ష చూపుతూ ఓటర్లను అర్హతలేనివారిగా ప్రకటించేందుకు ఈ ప్రక్రియను ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, పార్లమెంట్ ఆమోదించిన చట్టాలకు, ఎన్నికల నియమాలకు, సుప్రీం కోర్టు తీర్పులకు ఎస్ఐఆర్ విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈసీఐ పార్లమెంట్, సుప్రీం కోర్టుల కన్నా పెద్దది కాదు. రి ప్రజంటేషన్ పీపుల్ యాక్ట్ ప్రకారం ఫాం-6 లో స్వీయప్రకటన, ఆరు రకాల డాక్యుమెంట్‌లలో ఏదో ఒకటి సరిపోతుంది. కానీ సర్ లో మాత్రం పౌరసత్వం నిరూపించే బాధ్యతను ఓటర్లపైకి నెడుతున్నారు అని విమర్శించారు.
ఓటర్లపై భారం, చట్ట విరుద్ధ చర్యలు
ఒవైసీ వ్యాఖ్యానించిన విధంగా, సుప్రీం కోర్టు ‘లాల్‌బాబు హుస్సేన్’ తీర్పు ప్రకారం ఓ పేరు రోల్‌లో చేరిన వెంటనే ఆ వ్యక్తి పౌరుడని ముందుగా ఊహించాల్సి ఉంటుందని, ఎలాంటి విచారణ, నోటీసు, వినికిడి అవకాశం లేకుండా పేర్లు తొలగించడం చట్టవిరుద్ధమని తెలిపారు. 2025 రోల్‌లో ఉన్న ఓటర్లను అనుమానితుల్లా చూసి మళ్లీ డాక్యుమెంట్‌లు అడగడం ఎలా న్యాయం? అని ప్రశ్నించారు.
2003 రోల్‌ను బేస్‌గా తీసుకోవడం యాదృచ్ఛికం
ఈసీఐ 2003 ఓటరు జాబితాను బేస్‌లైన్‌గా తీసుకుని రివిజన్ నిర్వహించడం పూర్తిగా యాదృచ్ఛికమని, దీనికి ఆధారం ఏదీ లేదని ఆయన విమర్శించారు. పౌరసత్వంపై ప్రశ్నించడం హోం మంత్రిత్వ శాఖ పరిధి కాగా, ఎన్నికల సంఘం ఈ అధికారాన్ని స్వయంగా వినియోగించడం చట్ట పరంగా అనుచితం అని పేర్కొన్నారు.
3.66 లక్షల పేర్ల తొలగింపు, విదేశీయుల మినహాయింపు ఆర్డర్‌పై ప్రశ్నలు
ఎస్ఐఆర్ లో 3.66 లక్షల మంది పేర్లు తొలగించగానే ప్రభుత్వం కొత్త ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ యాక్ట్ తీసుకొచ్చింది. అంతేకాకుండా, సీఏఏ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న సమయంలో ఫారినర్స్ మినహాయింపు ఆర్టర్ ఎందుకు ఇచ్చారు? దీనివల్ల ఆ 3.66 లక్షల్లో ఉన్న ముస్లిం కాని వారిని రక్షించడమే ఉద్దేశ్యమని స్పష్టమవుతోందని ఒవైసీ అన్నారు.మొత్తానికి ఈ మొత్తం ప్రక్రియ ప్రజలపై అనవసర భారమేసే, మతపరమైన ప్రాతిపదికన ఓటు హక్కును దూరం చేసే ప్రయత్నమేనని ఒవైసీ అన్నారు. ఓటు హక్కును మౌలిక హక్కుగా మార్చేందుకు అన్ని పార్టీలూ ఏకాభిప్రాయం కావాలని ఆయన కోరారు.
