Let's talk: editor@tmv.in
ఎస్ఐఆర్ ను మేం ముందుగానే వ్యతిరేకించాం: టీవీకే

ఎస్ఐఆర్ ను మేం ముందుగానే వ్యతిరేకించాం: టీవీకే

Pinjari Chand
4 నవంబర్, 2025

ఎలక్షన్ కమిషన్ త్వరలో చేపట్టనున్న ఓటర్ల సమగ్ర జాబితా సవరణను మేం ముందుగానే వ్యతిరేకించామని తమిళ విజయం కజగం అధికార ప్రతినిధి వీరవిగ్నేష్ వివరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన డీఎంకే పై విమర్శలు గుప్పించారు. డీఎంకేను తమ పార్టీకి రాజకీయ శత్రువుగా, బీజేపీని భావజాల శత్రువుగా అభివర్ణించారు. తమిళనాడులో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– సర్)కు టీవీకే తీవ్రంగా వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. డీఎంకే ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన అన్ని పార్టీల సమావేశం నిర్వహించింది. వాస్తవానికి ఇది డీఎంకే మైత్రి కూటమి పార్టీల అఖిల పక్ష సమావేశమే అని గుర్తు చేశారు. అవినీతి ఆరోపణల దృష్టి మళ్లించేందుకే ఈ నాటకమని ఆయన అన్నారు. మొదటి రోజు నుంచి మేం చెబుతూనే ఉన్నాం. డీఎంకే మా రాజకీయ శత్రువు, బీజేపీ మా భావజాల శత్రువని. తమిళనాడులో ఎస్ఐఆర్‌పై మొదటగా వ్యతిరేక స్వరం వినిపించింది మా పార్టీనే అని ఆయన గుర్తుచేశారు. డీఎంకే అవినీతి, కుటుంబ రాచరిక పాలనను బయటపెడతామన్నారు. 2026లో ప్రజలే ఆ నియంతకి ముగింపు పలుకుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం:స్టాలిన్

ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ నేతృత్వంలోని అన్ని పార్టీల సమావేశం ఓ తీర్మానం ఆమోదించింది. ఎస్ఐఆర్ రెండో దశను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. స్టాలిన్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో తమిళనాడు ప్రజల ఓటు హక్కు హరించాలనే ఉద్దేశంతో ఈ ఎస్ఐఆర్‌ను అమలు చేస్తున్నారని ఆరోపించారు. 2026 ఎన్నికల తర్వాత సరైన సమయం ఇచ్చి సవరణ చేయాలన్న మా డిమాండ్‌ను ఎన్నికల సంఘం అంగీకరించనందున సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం అని పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన 49 పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హాజరుకాని పార్టీలూ ప్రజాస్వామ్య రక్షణ కోసం చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు.

టీవీకే మాత్రం సమావేశానికి హాజరుకాలేదు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఖండిస్తూ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. బీహార్‌లో ఇదే విధంగా ఓటర్ల పేర్లు తొలగించినట్లు గుర్తుచేస్తూ అదే మోడల్ తమిళనాడులోనూ అమలు చేయాలన్న దురుద్దేశం సర్ లో ఉన్నదని పార్టీ ఆరోపించింది.

ఎస్ఐఆర్ ను మేం ముందుగానే వ్యతిరేకించాం: టీవీకే - Tholi Paluku