
ఎస్ఐఆర్‌లో మీ ఓటరు వివరాలు నమోదయ్యాయా? ఒక్క మెసేజ్‌తో ఇలా తెలుసుకోండి!
తెలుగు రాష్ట్రాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్–ఎస్ఐఆర్) ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, తమ వివరాలు విజయవంతంగా నమోదు అయ్యాయా? లేదా? అనే సందేహం చాలా మంది ఓటర్లలో ఉంది. అలాంటి వారికి ఎన్నికల కమిషన్ సులభమైన ఒక్క మెసేజ్ సేవను అందుబాటులో ఉంచింది. మీ చేతిలో ఉన్న సాధారణ మొబైల్ ఫోన్‌తో మీ ఇంట్లో నుంచే ఎస్సెమ్మెస్ పంపించి మీ ఓటరు వివరాలు ఎస్‌ఐఆర్‌లో నమోదయ్యాయో, లేదో నేరుగా తెలుసుకోవచ్చు. ఈ సర్వీసులు పొందేందుకు స్మార్ట్‌ఫోన్ గానీ, ఇంటర్నెట్ గానీ అవసరంలేదు.
SMS ద్వారా వివరాలు తెలుసుకునే విధానం
• మీ ఫోన్ నుంచి 1950కి నంబర్‌కు మెసేజ్ చేయండి
• ECI అని టైప్ చేసి, ఒక స్పేస్ ఇచ్చి, ఆ తర్వాత మీ EPIC Number ఎంటర్ చేయండి
• ఉదా: ECI UTQ0777245
• SMS పంపిన కాసేపటికే ఈసీ నుంచి మీకు రిప్లై SMS వస్తుంది.
రిప్లైలో మీ పేరు, EPIC వివరాలు లేదా సంబంధిత సమాచారం అందితే, మీ వివరాలు ఎస్ఐఆర్ ప్రక్రియలో నమోదు అయ్యి ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ సమాచారం అందకపోతే లేదా స్పందన రాకపోతే, అది నమోదు కాలేదని ఖచ్చితంగా భావించకూడదు అని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో మీ ప్రాంతంలోని బూత్ లెవల్ అధికారి (బీఎల్‌వోను) లేదా ఎన్నికల అధికారులను సంప్రదించి వివరాలు నిర్ధారించుకోవడం మంచిది.
ఎపిక్ నంబర్ అనేది ప్రతి ఓటరికి కేటాయించే ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఇది ఓటరు గుర్తింపు కార్డుపై ముద్రించి ఉంటుంది. అలాగే ఎపిక్ నంబర్‌లో ఎలాంటి తప్పుల్లేకుండా టైప్ చేయాలని, మెసేజ్ పంపిన తర్వాత కాసేపు వేచి ఉండాలని సూచించారు. అయితే, కొన్నిసార్లు నెట్‌వర్క్ సమస్యల కారణాల వల్ల కూడా ఆలస్యంగా సమాధానం రావొచ్చని, ఏవైనా సందేహాలు ఉంటే మీ ప్రాంత బీఎల్‌వో లేదా ఎన్నికల అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రతి ఓటరు తన వివరాలను ముందుగానే ఒకసారి పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
