
ఎస్ఐఆర్లో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లు పరిగణించొద్దు: ఈసీకి బీజేపీ వినతి
రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లను ఓటరు నమోదు లేదా ధ్రువీకరణ ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రామాణిక పత్రాలుగా పరిగణించవద్దని తెలంగాణ బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని(ఈసీ) కోరింది. ఈ మేరకు పార్టీ ఎన్నికల సంఘం వ్యవహారాల కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.
వినతిపత్రంలో బీజేపీ పలు అభ్యంతరాలను ప్రస్తావించింది. ఫుడ్ సెక్యూరిటీ కార్డులకు అనుసంధానంగా రూపొందించిన తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌ను, ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో తీసుకురావడం రాజ్యాంగపరంగా, పరిపాలనా పరంగా అనేక సందేహాలకు తావిస్తోందని పేర్కొంది. ముఖ్యంగా, ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లను ఎస్ఐఆర్లో వచ్చిన ధ్రువీకరణ నోటీసులకు మద్దతు పత్రంగా ఉపయోగించవచ్చని కొందరు రాజకీయ నాయకులు ప్రభుత్వానికి సూచించిన అనంతరం ఈ నిర్ణయం రావడం మరింత అనుమానాలకు కారణమైందని ఆరోపించింది.
ఒకసారి ఎన్నికల సంఘం ఎస్ఐఆర్కు సంబంధించిన మార్గదర్శకాలు, అవసరమైన పత్రాలను ప్రకటించిన తర్వాత, ప్రక్రియ మధ్యలో కొత్త పత్రాన్ని ప్రవేశపెట్టడం లేదా దానిని అంగీకరించే ప్రయత్నం చేయడం న్యాయసూత్రాలకు విరుద్ధమని బీజేపీ అభిప్రాయపడింది. ఆట ప్రారంభమైన తర్వాత నిబంధనలు మార్చకూడదు అనే సూత్రాన్ని గుర్తుచేస్తూ, ఇప్పటికే ప్రారంభమైన ప్రక్రియలో కొత్త ప్రమాణాలను చేర్చడం ఓటరు జాబితాల పవిత్రత, పారదర్శకత, ఏకరూపతను దెబ్బతీస్తుందని పేర్కొంది.
అలాగే, ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ల ఆధారంగా అర్హత లేని వ్యక్తుల పేర్లు ఓటరు జాబితాలో కొనసాగించే అవకాశం ఉందనే విస్తృత ఆందోళన ప్రజల్లో నెలకొందని బీజేపీ ఆరోపించింది. రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు వంటి అక్రమ చొరబాటుదారులకు కూడా ఈ సర్టిఫికెట్లను ఆధారంగా చూపించి ఓటు హక్కు కల్పించే ప్రమాదం ఉందని పేర్కొంటూ, ఎస్ఐఆర్ ప్రక్రియలో వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని ఎన్నికల సంఘాన్ని కోరింది.
ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 172 ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌ను ఏర్పాటు చేసి, మీ సేవ వేదిక ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ల జారీకి అవకాశం కల్పించింది. ప్రభుత్వ సేవలు పొందే సమయంలో కుటుంబ వివరాలకు సంబంధించి ధ్రువీకరించిన, విశ్వసనీయ రికార్డు అందుబాటులో ఉండేలా చేయడం, కుటుంబ వివరాల ధ్రువీకరణలో ఏకరూపత తీసుకురావడం, పౌరులకు సులభంగా సేవలు అందించడం లక్ష్యంగా ఈ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ఈ సర్టిఫికెట్లను ప్రస్తుత ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉపయోగించకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేసింది.
