Let's talk: editor@tmv.in
ఎస్టోనియాలోకి ర‌ష్యా యుద్ధ విమానాలు!

ఎస్టోనియాలోకి ర‌ష్యా యుద్ధ విమానాలు!

Venkatesh Balusula
21 సెప్టెంబర్, 2025

ర‌ష్యా మ‌ళ్లీ యూరోప్ నాటో స‌భ్య దేశాల‌పై క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగింది. రష్యాకు చెందిన మూడు మిగ్–31 యుద్ధ విమానాలు అనుమతి లేకుండా ఎస్టోనియా గగనతలంలోకి చొరబడి, 12 నిమిషాల పాటు అక్కడే ఉన్నాయని ఎస్టోనియా ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటన ఫిన్‌లాండ్ గల్ఫ్ ప్రాంతంలో జరిగింది. దీనికి స్పందనగా ఇటలీ, ఫిన్‌లాండ్, స్వీడన్ దేశాలు నాటో మిషన్‌లో భాగంగా తమ యుద్ధ విమానాలను పంపాయి. నాటో ప్రతినిధి ఈ ఘటనను ఖండిస్తూ రష్యా నిర్లక్ష్యపు ప్రవర్తనకు ఇది మరో ఉదాహరణ అన్నారు.

ఆరోప‌ణ‌లు ఖండించిన ర‌ష్యా

రష్యా మాత్రం ఎస్టోనియా గగనతలంలోకి చొరబడినట్లు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఖండించింది. ఇటీవల పోలాండ్, రొమేనియా వంటి నాటో సభ్య దేశాల గగనతలంలో రష్యా డ్రోన్‌లు చొరబడిన ఘటనలతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ ఘటనతో ఎస్టోనియా నాటో ఒప్పందంలోని ఆర్టికల్ 4ను ప్ర‌స్తావిస్తూ చ‌ర్చ‌లు జ‌రిపింది. ఈ ఆర్టికల్ ప్రకారం 32 సభ్య దేశాలతో కూడిన నాటో సమిష్టి రక్షణ కోసం తక్షణ సంప్రదింపులు ప్రారంభిస్తుంది. ఈ నెలలో ఇలాంటి సంప్రదింపులను కోరిన రెండో నాటో దేశం ఎస్టోనియా, ఇంతకు ముందు సెప్టెంబర్ 10న పోలాండ్ ఇదే విధంగా సంప్రదింపులు కోరింది. ఎస్టోనియా ప్రధాని క్రిస్టెన్ మిచాల్ మాట్లాడుతూ ర‌ష్యా రెచ్చగొట్టే చర్యల‌కు నాటో సమిష్టిగా, బ‌లంగా స్పందించాల‌న్నారు. మిత్ర దేశాలతో సంప్రదింపులు జరపడం, తదుపరి చర్యలపై ఒకే ఆలోచన కలిగి ఉండటం అవసరమని ఆయన చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనపై స్పందించారు. ఇలాంటివి త‌న‌కు ఇష్టం లేద‌ని, ఇది పెద్ద సమస్యగా మారవచ్చని చెప్పారు. ఎస్టోనియా, రష్యాతో తూర్పు సరిహద్దును పంచుకుంటుంది. ఈ సంవత్సరంలో ఐదోసారి రష్యా గగనతల ఉల్లంఘనకు పాల్ప‌డింద‌ని అధికారులు తెలిపారు. రష్యా విమానాలు ఈశాన్య దిశ నుంచి ఎస్టోనియా గగనతలంలోకి ప్రవేశించాయని, ఫిన్‌లాండ్ యుద్ధ విమానాలు వాటిని గల్ఫ్ ఆఫ్ ఫిన్‌లాండ్‌లో అడ్డుకున్నాయని చెప్పారు. ఎస్టోనియాలో ఉన్న ఇటలీకి చెందిన ఎఫ్ 35 విమానాలు నాటో బాల్టిక్ ఎయిర్ పోలీసింగ్ మిషన్‌లో భాగంగా ఈ విమానాలను గగనతలం నుంచి తరిమివేశాయి. రష్యా విమానాలు ఎలాంటి ప్ర‌ణాళిక‌ లేకుండా, ట్రాన్స్‌పాండర్లు ఆఫ్ చేసి, ఎస్టోనియా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో రేడియో సంబంధం లేకుండా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. రష్యా రక్షణ శాఖ మాత్రం తమ విమానాలు అంతర్జాతీయ గగనతల నిబంధనలను పాటిస్తూ, ఎస్టోనియాకు చెందిన వైండ్లూ దీవి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో నీటిపై ఎగురుతున్నాయని, ఎలాంటి సరిహద్దు ఉల్లంఘన జరగలేదని చెప్పింది.

పోలండ్‌లో మూడు డ్రోన్లు కూల్చివేత‌

ఈ ఘ‌ట‌న‌ను గగనతలంలో జరిగిన అత్యంత తీవ్రమైన ఉల్లంఘనగా భావిస్తున్నారు. ఎస్టోనియా విదేశాంగ మంత్రి మార్గస్ సాహ్క్నా రష్యాకు ఇవ‌న్నీ అల‌వాటేన‌న్నారు. రష్యా క్రమంగా రెచ్చగొట్టే చర్యలను పెంచుతూ, నాటో రక్షణ వ్యవస్థలను పరీక్షిస్తోందని చెప్పారు. ఈ పరిస్థితిలో నాటో మరింత కఠినంగా స్పందించాలని యూకే మాజీ రక్షణ కార్యదర్శి సర్ బెన్ వాలెస్ సహా కొందరు పిలుపునిచ్చారు. రష్యా రెచ్చగొట్టే చర్యలకు మూల్యం చెల్లించుకుంటుంద‌ని వారు పేర్కొన్నారు. 2015లో టర్కీ గగనతలంలో రష్యా విమానం చొరబడినప్పుడు, టర్కీ దాన్ని కూల్చివేసింది. ఆ ఘటన తర్వాత రష్యా ఇలాంటి ఉల్లంఘనలు చేయలేదు. ఈసారి రష్యా విమానాలను కూల్చి ఉంటే ప‌రిస్థితి మ‌రో విధంగా ఉండేది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇలాంటి చర్యను ఉద్రిక్తతగా భావిస్తూ, యూరప్‌కు అమెరికా మద్దతు ఇవ్వకపోవచ్చని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పోలాండ్‌లో రష్యా డ్రోన్‌లు చొరబడిన ఘటనలో పోలాండ్ మూడు డ్రోన్‌లను కూల్చివేసింది. రష్యా ఈ ఘటన ఉద్దేశపూర్వకం కాదని చెప్పింది. రొమేనియా కూడా రష్యా డ్రోన్‌ను గుర్తించింది. కానీ అది రాడార్ నుంచి మాయమైంది. ఈ ఘటనలకు స్పందనగా నాటో తూర్పు సరిహద్దులను బలోపేతం చేయడానికి యూకే, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్ నుంచి విమానాలను పంపింది. ఈ ఘటనలు నాటో సభ్య దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతున్నాయి, రష్యాతో ఎలా వ్యవహరించాలనే దానిపై యూరప్ దేశాలు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఎస్టోనియాలోకి ర‌ష్యా యుద్ధ విమానాలు! - Tholi Paluku