Let's talk: editor@tmv.in
ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతి అన్‌స్టాపబుల్: సీఎం

ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతి అన్‌స్టాపబుల్: సీఎం

Panthagani Anusha
12 జనవరి, 2026

అమరావతి గ్రీన్‌ఫీల్డ్ రాజధాని అభివృద్ధిని ఎవరూ ఆపలేరని, ఎంతమంది కుట్రలు చేసినా అది అన్‌స్టాపబుల్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణ వేగాన్ని చూసి కొందరు అసూయతో అడ్డంకులు సృష్టించాలని కలలు కంటున్నారని అయితే ప్రపంచం మెచ్చే విధంగా రాజధానిని నిర్మించడం తథ్యమని ఆయన పేర్కొన్నారు.

విజయవాడలోని సిద్ధార్థ అకాడమీ విద్యా సంస్థల స్వర్ణోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “ప్రపంచం మెచ్చే అమరావతిని మేము నిర్మించబోతున్నాం. దాని అభివృద్ధిని ఆపాలని కలలు కనే వారు ఉన్నా, అమరావతి ఆగదు అని స్పష్టం చేశారు. నది పరివాహక ప్రాంతంలో రాజధాని నిర్మాణమంటూ జరుగుతున్న విమర్శలు అవాస్తవమని నీరు ఉన్న చోటే నాగరికతలు వికసించాయన్న చారిత్రక సత్యాన్ని తెలియని వారు రాజకీయాలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, రాజమండ్రి, విశాఖపట్నం, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, లండన్ వంటి మహానగరాలు ఎక్కడ నిర్మితమయ్యాయో చూడాలని ప్రశ్నించారు. భవిష్యత్తులో విజయవాడ,గుంటూరు, మంగళగిరి, అమరావతి కలిసి ఉత్తమ జీవనయోగ్య ప్రాంతంగా మారుతాయని తెలిపారు.

ఆరు నెలల్లో క్వాంటమ్ కంప్యూటర్

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్వాంటమ్ మిషన్‌ను అవకాశంగా తీసుకుని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. వచ్చే ఆరు నెలల్లో ఈ కేంద్రం పని ప్రారంభిస్తుందని క్వాంటమ్ అల్గోరిథమ్స్‌పై విద్యార్థులు, నిపుణులకు శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. రాబోయే రెండేళ్లలో క్వాంటమ్ కంప్యూటర్ల తయారీ ద్వారా ప్రపంచానికి సరఫరా చేసే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు.

విద్యకు అత్యున్నత ప్రాధాన్యం

విద్యారంగంలో కూటమి ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిందని చంద్రబాబు చెప్పారు. ప్రతి కిలోమీటర్‌కు ఎలిమెంటరీ స్కూల్, మూడు కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ స్కూల్, ఐదు కిలోమీటర్లకు హైస్కూల్, ప్రతి మండలంలో జూనియర్ కాలేజీ, ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఇంజినీరింగ్ కాలేజీ, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని వివరించారు. ఏడాదికి రెండుసార్లు మెగా పేరెంట్–టీచర్ సమావేశాలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి వచ్చిన ప్రతిష్టాత్మక కేంద్ర విద్యా సంస్థలను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని, ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను అమరావతికి తీసుకొస్తామని సీఎం స్పష్టం చేశారు. అదేవిధంగా విశాఖపట్నానికి గూగుల్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు వస్తున్నాయని, రాయలసీమలో స్పేస్ సిటీ, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లును డ్రోన్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల చెంతకు చేరుస్తున్నామని ఈ సందర్భంగా వివరించారు.

ఇదిలా ఉండగా అమరావతి రాజధాని ప్రాజెక్టుపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ఎస్. రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తొలి దశలో రైతుల నుంచి తీసుకున్న భూముల అభివృద్ధి పూర్తికాకుండానే రెండో దశ ల్యాండ్ పూలింగ్‌ను తొందరపెడుతున్నారని ఆరోపించారు. అమరావతిని స్కాముల కేంద్రంగా మార్చారని భారీ అప్పులు చేసినా రాజధానికి సంబంధించి ఎలాంటి పనులు జరగడం లేదని విమర్శించారు.