Let's talk: editor@tmv.in
ఎవరి డిజిటల్ కంటెంట్‌కు వారే బాధ్యత వహించాలి:అశ్వినీ వైష్ణవ్

ఎవరి డిజిటల్ కంటెంట్‌కు వారే బాధ్యత వహించాలి:అశ్వినీ వైష్ణవ్

Pinjari Chand
27 ఫిబ్రవరి, 2026

డిజిటల్ వేదికలు తమపై హోస్ట్ అయ్యే కంటెంట్‌కు పూర్తి బాధ్యత వహించాల్సిందేనని, అలాగే కంటెంట్ సృష్టికర్తలు, వార్తా సంస్థలకు న్యాయమైన ఆదాయ భాగస్వామ్యం కల్పించాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం స్పష్టం చేశారు. డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (డీఎన్పీఏ) కాన్‌క్లేవ్‌లో ప్రసంగించిన ఆయన, తగిన పారితోషికం లేకపోతే ఆవిష్కరణలకు భంగం కలుగుతుందని హెచ్చరించారు. ప్లాట్‌ఫార్ములు తమ వద్ద హోస్ట్ అయ్యే కంటెంట్‌పై బాధ్యత తీసుకోవాలి. పిల్లలు, పౌరుల ఆన్‌లైన్ భద్రత ప్లాట్‌ఫార్ముల బాధ్యతే అని ఆయన అన్నారు.

డిజిటల్ మధ్యవర్తులు ఇప్పుడు శక్తివంతమైన మీడియా వేదికలుగా మారిపోయాయని, కాబట్టి మాధ్యమ సంస్థల మాదిరిగానే బాధ్యత వహించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. డిజిటల్ వేదికలు కేవలం మధ్యవర్తులు మాత్రమేనని చెప్పే రోజులు ముగిశాయని అన్నారు. మేధో సంపత్తి హక్కులను(పేటెంట్ రైట్స్) గౌరవించి, సరైన ఆదాయం పంచాలని ఆయన సూచించారు. వార్తా సంస్థలకే కాకుండా దూర ప్రాంతాల సొంత కంటెంట్ రైటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, అధ్యాపకులు, పరిశోధకులకు కూడా సముచిత ఆదాయ భాగస్వామ్యం కల్పించాలని కోరారు. స్వచ్ఛందంగా మార్పులు చేయకపోతే చట్టపరమైన మార్గాలు అనుసరించే దేశాలు ఇప్పటికే ఉన్నాయని ఆయన హెచ్చరించారు.

కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా సృష్టించే కంటెంట్‌పై కూడా కఠిన నియంత్రణ అవసరమని పేర్కొన్నారు. ఎవరైనా వ్యక్తి ముఖం, గాత్రం లేదా వ్యక్తిత్వాన్ని ఉపయోగించి కంటెంట్ సృష్టించాలంటే ముందుగా వారి సమ్మతి తప్పనిసరని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ప్రముఖుల వీడియోలు రూపొందించడం అంగీకారయోగ్యం కాదన్నారు. డీప్‌ఫేక్‌లు, తప్పుడు సమాచార ప్రవాహం, సింథటిక్ చిత్రాలు వంటి కొత్త సాంకేతిక సవాళ్లు సమాజంలో సంస్థలపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబం నుంచి న్యాయవ్యవస్థ, మీడియా, శాసనసభల వరకు అన్ని సంస్థలు పరస్పర విశ్వాసంపై ఆధారపడి ఉంటాయని ఆయన గుర్తుచేశారు.

ఇంటర్నెట్ స్వభావం మారిపోయిందని, అది ఇక ఓపెన్ సోర్స్ సమాచారం మార్పిడి వేదిక మాత్రమే కాదని, శక్తివంతమైన మీడియా వేదికగా మారిందని అన్నారు. కాబట్టి తప్పుడు సమాచారం వేగంగా వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్లాట్‌ఫార్ములు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ మోసాలు, ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం వంటి సమస్యలపై కూడా కఠిన చర్యలు అవసరమని పేర్కొన్నారు. ఇటీవలి చట్టసవరణలతో కోట్లాది కుటుంబాలను ఆర్థిక నష్టాల నుంచి రక్షించామని తెలిపారు. సమాజం ఇప్పుడు మార్పును కోరుతోంది. ఈ కీలక మలుపులో డిజిటల్ ప్లాట్‌ఫార్ములు సమాజ అవసరాలకు అనుగుణంగా ముందడుగు వేయాలని కేంద్ర మంత్రి వైష్ణవ్ పిలుపునిచ్చారు.