
ఎల్పీజీ సరఫరా సమస్యపై పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన
రోజురోజూకూ పెరుగుతున్న ఎల్పీజీ సరఫరా సమస్యను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష ఎంపీలు బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఘర్షణ నాలుగో వారంలోకి ప్రవేశించగా, హర్ముజ్ మార్గం ద్వారా జరిగే వాణిజ్య రవాణా తీవ్రంగా ప్రభావితమైంది. ఫిబ్రవరి 28న ఆయోతుల్లా అలీ ఖమేనీ మృతితో పరిస్థితులు మరింత ఉద్రిక్తమయ్యాయి. దీనికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లో అమెరికా, ఇజ్రాయెల్ ఆస్తులపై దాడులు చేయడంతో అంతర్జాతీయ ఇంధన సరఫరాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది.
ఈ నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ కొరత నెలకొన్నదని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతారాయ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎల్పీజీ సంక్షోభాన్ని సరిగా నిర్వహించలేకపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలన్నారు. శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్‌రౌత్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉంటే మేము సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం గ్లోబల్ సంక్షోభంలో భారత్ పాత్ర ఏమిటి అన్నది కీలకం అన్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ మాట్లాడుతూ దేశంలో అన్నీ సవ్యంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది కానీ గ్రామాలు, పట్టణాల్లో ఎల్పీజీ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. నవరాత్రి, ఈద్ సమయంలో కూడా కొరత కనిపించింది. అందుకే ప్రజల సమస్యల కోసం మేము నిరసన చేపట్టామన్నారు.
ఇదిలా ఉండగా, మంగళవారం రెండు భారత ఎల్పీజీ నౌకలు — ‘జాగ్ వసంత్’, ‘పైన్ గ్యాస్’ హర్ముజ్ ద్వారా విజయవంతంగా ప్రయాణించి భారత్ వైపు పయనమయ్యాయి. ఈ రెండు నౌకలు కలిపి సుమారు 92,612 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ తీసుకువస్తున్నాయి. మార్చి 26 నుంచి 28 మధ్య భారత తీరానికి చేరుకునే అవకాశం ఉంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో మాట్లాడుతూ పశ్చిమ ఆసియా సంక్షోభం దేశానికి ఒక పెద్ద పరీక్షగా మారుతుందని పేర్కొన్నారు. కేంద్రం-రాష్ట్రాలు కలిసి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో పేదలు, కార్మికులు, వలస కార్మికులు ఎక్కువగా ప్రభావితమవుతారు. వారికి పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన ప్రయోజనాలు సమయానికి అందేలా చూడాలని సూచించారు. మొత్తంగా, పశ్చిమ ఆసియా సంక్షోభ ప్రభావంతో దేశంలో ఇంధన సరఫరా, ధరలపై ఒత్తిడి పెరుగుతుండగా, దీనిపై రాజకీయ వాదోపవాదాలు కూడా ఉధృతమవుతున్నాయి.
