Let's talk: editor@tmv.in
ఎల్పీజీ సంక్షోభానికి కేంద్ర విధానాలే కారణం: కేజ్రీవాల్

ఎల్పీజీ సంక్షోభానికి కేంద్ర విధానాలే కారణం: కేజ్రీవాల్

Pinjari Chand
12 మార్చి, 2026

దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడిందని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వంపై అరవింద్ కేజ్రీవాల్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనుసరించిన విదేశాంగ విధానం వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని ఆయన అన్నారు. జాతీయ రాజధానిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్, పశ్చిమాసియా యుద్ధంలో భారత్‌కు ప్రత్యక్ష ప్రయోజనం లేకపోయినా అమెరికా–ఇజ్రాయెల్ వైపు నిలబడటం ద్వారా గతంలో ఉన్న ‘నాన్ అలైన్’ విధానాన్ని కేంద్రం పూర్తిగా దెబ్బతీసిందని ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో వంటగ్యాస్‌తో పాటు పరిశ్రమల్లో ఉపయోగించే ఎల్పీజీ కొరత తీవ్రంగా ఉందని ఆయన చెప్పారు. దేశంలో వినియోగించే ఎల్పీజీలో దాదాపు 60 శాతం దిగుమతులపై ఆధారపడుతుందని, అందులో 90 శాతం వరకు హర్ముజ్ జలసంధి ద్వారా వస్తుందని తెలిపారు. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఆ మార్గంలో భారత్‌కు వచ్చే సరఫరా గణనీయంగా తగ్గిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్–అమెరికా కలిసి ఇరాన్‌పై దాడి చేసిన తర్వాత పరిస్థితి మరింత క్లిష్టమైందని అన్నారు. ఇరాన్‌కు మద్దతు ఇచ్చే దేశాలకు మాత్రమే తమ జలసంధి మార్గం ద్వారా నౌకలను అనుమతిస్తున్నదని ఆయన ఆరోపించారు.అమెరికా చెప్పినట్టు ఇక్కడి ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారు. అప్పుడు బ్రిటీష్ వారు దోచుకున్నారు. ఇప్పుడు అమెరికా కాలనీలు దోచుకుంటున్నాయి. అక్కడి చిన్న, చితకా నేతలు కూడా ప్రధాని గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. అయినా ఇక్కడి ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.

కోటికిపైగా నిరుద్యోగులయ్యే ప్రమాదం

ఈ పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు తీవ్ర ప్రభావం ఎదుర్కొంటున్నాయని ఆయన చెప్పారు. భద్రతా కారణాల వల్ల ఈ రంగాలు ఎల్పీజీని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోలేవని, రోజువారీ సరఫరాపైనే ఆధారపడాల్సి వస్తుందని వివరించారు. ఇప్పటికే ముంబైలో సుమారు 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయని, త్వరలో మరిన్ని మూసివేసే పరిస్థితి ఉందని వాపోయారు. పంజాబ్, ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో కూడా వేలాది హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న సమయంలో ఈ పరిస్థితి మరింత కష్టాలను తెచ్చిపెడుతుందని తెలిపారు. గుజరాత్‌లోని మోర్బీలో టైల్ పరిశ్రమలపైనా ఈ సంక్షోభం ప్రభావం చూపుతోందని ఆయన చెప్పారు. అక్కడ ఉన్న 650 పరిశ్రమల్లో ఇప్పటికే 170 మూతపడ్డాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితి కొనసాగితే దేశవ్యాప్తంగా దాదాపు ఒక కోటి మందికి పైగా నిరుద్యోగులు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా, పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాల చట్టాన్ని అమలు చేస్తూ గృహ వినియోగం, ఆసుపత్రులు వంటి అత్యవసర సేవలకు ఎల్పీజీ సరఫరాకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ మధ్య కనీసం 25 రోజుల విరామం ఉండేలా కొత్త నిబంధనను అమలు చేసింది.

ఎల్పీజీ సంక్షోభానికి కేంద్ర విధానాలే కారణం: కేజ్రీవాల్ - Tholi Paluku