
ఎల్పీజీ సంక్షోభం.. గ్రామాలకు వలస కార్మికుల తిరుగుబాట
వంటగ్యాస్ (ఎల్పీజీ) సంక్షోభం కారణంగా నగరాల్లో జీవించడం కష్టంగా మారడంతో వలస కార్మికులు తిరిగి తమ సొంత గ్రామాలకు వెళ్లడం ప్రారంభించారు. గ్యాస్ సిలిండర్ల కొరత, రీఫిల్ ఆలస్యం, బ్లాక్ మార్కెట్‌లో భారీ ధరల కారణంగా అనేక మంది కార్మికులు నగరాలను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతంలోని రైల్వే స్టేషన్లలో ఇటీవల రోజుల్లో అసాధారణ రద్దీ కనిపిస్తోంది. వలస కార్మికులు తమ కుటుంబాలతో కలిసి పరుపులు, పాత్రలు, బస్తాలతో స్టేషన్లకు చేరుకొని స్వగ్రామాలకు వెళ్లే రైళ్ల కోసం వేచి చూస్తున్నారు.
38 ఏళ్ల రాధే శ్యామ్ అనే కార్మికుడు రోజులో గిగ్ వర్కర్‌గా, రాత్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ గ్యాస్ సిలిండర్ దొరకకపోవడంతో అతను తన స్వగ్రామం బితూర్ (ఉత్తరప్రదేశ్)కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
అతను ఆనంద్ విహర్ రైల్వే స్టేషన్ వద్ద టికెట్ కోసం క్యూలో నిలబడి మాట్లాడుతూ ‘రోజుకు ఎన్నో పనులు చేసినా నెలకు రూ.20 వేలకంటే ఎక్కువ రాదు. నా భార్య ఇళ్లలో పని చేసి మరో రూ.5 వేలు సంపాదిస్తుంది. నలుగురితో కుటుంబం నడపడం ఇప్పటికే కష్టమైపోయింది. ఇప్పుడు ఒక గ్యాస్ సిలిండర్‌కు రూ.3 వేల వరకు చెల్లించడం ఎలా సాధ్యం? అని వేదన వ్యక్తం చేశాడు.
అదే స్టేషన్‌లో మరో కార్మికుడు సుమన్ వర్మ తన గ్రామానికి పెళ్లి కారణంగా వెళ్తున్నానని చెప్పినా, వాస్తవానికి గ్యాస్ సమస్యే కారణమని అతని కుమారుడు తెలిపాడు. ఇప్పటికే గ్యాస్ అయిపోయి తాత్కాలిక పొయ్యిపై వంట చేయాల్సి వచ్చిందని అతను చెప్పాడు. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ.913గా ఉన్నప్పటికీ, సరైన పత్రాలు లేకుండా కొనుగోలు చేసే వలస కార్మికులకు బ్లాక్ మార్కెట్‌లో రూ.3 వేలకంటే ఎక్కువకు అమ్ముతున్నారని కార్మికులు చెబుతున్నారు. 5 కిలోల చిన్న సిలిండర్ల కొరత కూడా పరిస్థితిని మరింత కష్టతరం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వలస కార్మికుల కోసం మార్కెట్ ధరకు లభించే 5 కిలోల ఎల్పీజీ సిలిండర్ల రోజువారీ కోటాను రెట్టింపు చేసినట్లు ప్రకటించింది.
స్టేషన్లలో పెరిగిన రద్దీ
రైల్వే స్టేషన్లలో పనిచేసే కూలీలు కూడా వలస కార్మికుల ప్రవాహం పెరిగిందని చెబుతున్నారు. ‘స్టేషన్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కానీ ఇటీవలి రోజుల్లో గ్రామాలకు వెళ్తున్న కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పరిస్థితి మెరుగుపడకపోతే నేను కూడా వెళ్లాల్సి రావచ్చు’ అని మధ్యప్రదేశ్‌కు చెందిన కూలీ జగదీష్ తెలిపారు. నోయిడాలో ఒక హోటల్‌లో వంటమనిషిగా పనిచేసిన విష్ణు కుమార్ కూడా ఉద్యోగం కోల్పోయి తన స్వగ్రామం కన్నౌజ్‌కు వెళ్లాల్సి వచ్చింది. వ్యాపారం కొనసాగుతుందో లేదో తెలియక తనను ఉద్యోగం నుంచి పంపించారని అతను తెలిపాడు. ఇక నోయిడాలో కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న ఓం ప్రకాశ్, ఆయన భార్య నిర్మల కూడా చివరికి స్వగ్రామం ఈటవాహ్‌కు వెళ్లాలని నిర్ణయించారు. గ్యాస్ సంక్షోభం కొనసాగితే నగరాల్లో వలస కార్మికుల భారీ స్థాయిలో వలసలు మరింత పెరిగే అవకాశముందని పరిశీలకులు అంటున్నారు.
