Let's talk: editor@tmv.in
ఎల్పీజీ సంక్షోభంపై రాజ్యసభలో మాటల యుద్ధం

ఎల్పీజీ సంక్షోభంపై రాజ్యసభలో మాటల యుద్ధం

Pinjari Chand
17 మార్చి, 2026

దేశంలో ఏర్పడిన ఎల్పీజీ సరఫరా సమస్యపై సోమవారం రాజ్యసభలో అధికార–ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించగా, కేంద్ర మంత్రి జేపీ.నడ్డా కాంగ్రెస్‌పై ప్రతిస్పందించారు. రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ, పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఎల్పీజీ దిగుమతులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ముందుగానే తెలిసినా కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. సరైన ముందస్తు ప్రణాళిక లేకపోవడమే దేశంలో ఎల్పీజీ సంక్షోభానికి కారణమని అన్నారు.

భారత్‌కు అవసరమైన ఎల్పీజీ లో సుమారు 60 శాతం దిగుమతుల ద్వారానే వస్తుందని, అందులో దాదాపు 90 శాతం సరుకు హర్ముజ్‌ మార్గం గుండా వస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మార్గం ప్రభావితమవడంతో దేశంలో సరఫరా, ధరల స్థిరత్వంపై ఆందోళనలు పెరిగాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇళ్లతో పాటు చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, కమ్యూనిటీ కిచెన్లు, సూక్ష్మ–చిన్న పరిశ్రమలు ఎల్పీజీ కొరతతో ఇబ్బందులు పడుతున్నాయని ఖర్గే తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఒక సిలిండర్ ధర రూ.5,000కిపైగా కూడా విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు. నగరాల్లో సిలిండర్ బుకింగ్‌కు సుమారు 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు వేచి చూడాల్సి వస్తోందని చెప్పారు.

కాంగ్రెస్‌ భయాందోళనలు సృష్టిస్తోంది

ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందించిన జేపీ నడ్డా ప్రతిపక్షాలు ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ సంక్షోభ సమయంలో కూడా రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. దేశ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుత పశ్చిమాసియా పరిస్థితులకు భారత్‌కు ఎలాంటి సంబంధం లేదని, అయినప్పటికీ ప్రతిపక్షాలు దాన్ని రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎల్పీజీ సిలిండర్లను నిల్వ చేసుకుంటున్న ఘటనలు కూడా బయటపడినట్లు ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌రిజిజు మాట్లాడుతూ, ఈ అంశంపై ఇప్పటికే లోక్‌సభలో పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్‌పురి సమగ్ర వివరణ ఇచ్చారని తెలిపారు. ఇక రాజ్యసభాధ్యక్షుడు రాధాకృష్ణన్‌ ఖర్గేకు మాట్లాడేందుకు కేటాయించిన సమయం ముగిసిందని పలుమార్లు సూచించినప్పటికీ, కొంత అదనపు సమయం ఇచ్చి ప్రసంగాన్ని కొనసాగించేందుకు అనుమతించారు.

లోక్‌సభలో సస్పెండ్ చేసిన 8 మంది ఎంపీల సస్పెన్షన్‌ రద్దుకు అంగీకారం

లోక్‌సభ బడ్జెట్ సమావేశాల తొలి భాగంలో సస్పెండ్ చేసిన ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై మంగళవారం పార్లమెంట్‌లో అధికారిక ప్రతిపాదన తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈ విషయంలో ఏకాభిప్రాయం ఏర్పడినట్లు వర్గాలు తెలిపాయి. సభలో క్రమశిక్షణ పాటించడం, ప్లకార్డులు లేదా ఏఐతో రూపొందించిన చిత్రాలను ప్రదర్శించకపోవడం వంటి అంశాలపై సభ్యులు అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 4న బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలను బడ్జెట్ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ తూర్పు లడఖ్‌లో 2020లో చైనా‌తో జరిగిన సరిహద్దు ఉద్రిక్తతల అంశాన్ని ప్రస్తావించాలని పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. ఆ సమయంలో కొంతమంది సభ్యులు కుర్చీ వైపు పత్రాలు విసిరినట్లు ఆరోపణలు రావడంతో సస్పెన్షన్ విధించారు.

ఎల్పీజీ సంక్షోభంపై రాజ్యసభలో మాటల యుద్ధం - Tholi Paluku