Let's talk: editor@tmv.in
ఎల్పీజీ ధరల పెంపుపై దేశంలో నిరసనలు

ఎల్పీజీ ధరల పెంపుపై దేశంలో నిరసనలు

Pinjari Chand
9 మార్చి, 2026

ఎల్పీజీ గ్యాస్ ధరల పెంపుపై పలు రాజకీయ పార్టీల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోల్‌కత్తాలో ఆల్‌ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌ మహిళా కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించగా, మరోవైపు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్‌)కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. మధ్య కోల్‌కత్తాలోని సుబోధ్‌ ముల్లిక్‌ స్క్వేర్ నుంచి ప్రారంభమైన టీఎంసీ మహిళల ర్యాలీలో రాష్ట్ర మంత్రులు చంద్రిమా భట్టాచార్య, శశి పంజా, టీఎంసీ ఎంపీ మాల రాయ్‌తో పాటు పలువురు మహిళా నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. నిరసనలో పాల్గొన్న మహిళలు నల్ల దుస్తులు ధరించి పాత్రలు కొడుతూ గ్యాస్ ధరల పెంపుపై ఆందోళన వ్యక్తం చేశారు. వంటగదులను ప్రధానంగా మహిళలే నిర్వహిస్తారని, గ్యాస్ ధరలు పెరగడం వల్ల కుటుంబాలపై భారం మరింత పెరుగుతోందని నిరసనకారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక రోజు ముందు గ్యాస్ సిలిండర్ ధర దాదాపు రూ.1000కు చేరుకుందని మంత్రి శశి పంజా విమర్శించారు. ధరలు తగ్గించే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని టీఎంసీ నాయకులు తెలిపారు.

పన్నులు తగ్గించకుండా ధరలు పెంచుతారా?

ఇదిలా ఉండగా, ఎల్పీజీ ధరల పెంపుపై సీపీఐ(ఎం) కూడా కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. గృహ వినియోగ సిలిండర్ ధరను రూ.60, వాణిజ్య వినియోగ 19 కిలోల సిలిండర్ ధరను రూ.114.50 పెంచడం వల్ల మధ్యతరగతి, కార్మిక వర్గాలపై అదనపు భారం పడుతుందని పార్టీ పేర్కొంది. ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులపై ఈ పెంపు ప్రభావం ఎక్కువగా ఉంటుందని సీపీఐ(ఎం) తెలిపింది. ఇప్పటికే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తగ్గుతున్న ఆదాయాల మధ్య ఈ నిర్ణయం ప్రజలకు మరింత కష్టాలు తెస్తుందని విమర్శించింది. ధరల పెంపునకు పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని కారణంగా చూపడం సరైన సమాధానం కాదని కూడా పార్టీ పేర్కొంది. సిలిండర్లపై పన్నులు తగ్గించకుండా ప్రభుత్వం ఆదాయం కొనసాగించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించింది.

శనివారం కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.60 పెంచడంతో, ఢిల్లీలో 14.2 కిలోల నాన్-సబ్సిడీ సిలిండర్ ధర రూ.853 నుంచి రూ.913కు పెరిగింది. ఇండియన్ అయిల్‌ కార్పోరేషన్‌ ప్రకారం ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 10 కోట్లకు పైగా ఉజ్వల యోజన లబ్ధిదారులు కూడా ఈ పెంపుతో ప్రభావితమవుతారు. వారికి సంవత్సరానికి 12 సిలిండర్ల వరకు ఇచ్చే రూ.300 సబ్సిడీ తర్వాత ఒక్క సిలిండర్ ధర సుమారు రూ.613గా ఉంటుంది.