Let's talk: editor@tmv.in
ఎల్పీజీ కొరత..కిరోసిన్ పంపిణీకి కేంద్రం అనుమతి

ఎల్పీజీ కొరత..కిరోసిన్ పంపిణీకి కేంద్రం అనుమతి

Pinjari Chand
31 మార్చి, 2026

పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇంధన సరఫరా గొలుసు దెబ్బతినడంతో ఎల్పీజీ కొరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా కిరోసిన్ పంపిణీకి అనుమతి ఇచ్చింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అదనంగా కిరోసిన్ కేటాయింపును ప్రభుత్వం ఆమోదించింది. భారతదేశం వినియోగించే వంటగ్యాస్‌లో సుమారు 60 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. వాటిలో 85–90 శాతం వరకు గల్ఫ్ దేశాల నుంచే వస్తాయి. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం కారణంగా సరఫరా అంతరాయం ఏర్పడడంతో హోటళ్లు, రెస్టారెంట్లకు ఎల్పీజీ సరఫరాను తగ్గించారు.

ఇళ్లకు అవసరమైన గ్యాస్ సరఫరాకు ప్రాధాన్యం ఇచ్చినా, నిల్వలు పరిమితంగా ఉండడంతో పలుచోట్ల భారీ క్యూలు, కొనుగోళ్లు ఆందోళనలు కనిపిస్తున్నాయి. ఈ ఒత్తిడిని తగ్గించేందుకు తాత్కాలికంగా కిరోసిన్‌ను వంటకు, వెలుగుకు ఉపయోగించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ మార్చి 29న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పెట్రోలియం యాక్ట్‌ 1934 , పెట్రోలియం రూల్స్ 2002, కింద ప్రత్యేక మినహాయింపులు ఇచ్చి కిరోసిన్ పంపిణీకి అనుమతించింది.

ప్రతి జిల్లాలో రెండు వరకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల సేవా కేంద్రాల్లో గరిష్టంగా 5,000 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వ ఉంచేందుకు అనుమతించారు. కిరోసిన్ డీకాంటింగ్ కోసం ఏజెంట్లు, డీలర్లు ప్రత్యేక లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇప్పటికే లైసెన్స్ ఉన్న ట్యాంకర్ వాహనాలకు అదనపు అనుమతులు కూడా అవసరం ఉండదు. అయితే భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, నిల్వ, పంపిణీ వివరాలను నమోదు చేసి జిల్లా అధికారులు, పెట్రోలియం, ఎక్స్‌ప్లోజివ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ పరిశీలనకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని, 60 రోజుల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఇది అమల్లో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.