
ఎల్పీజీ అక్రమ నిల్వలపై దాడులు.. రూ.1.50 కోట్ల సిలిండర్లు స్వాధీనం
రాష్ట్రంలో డొమెస్టిక్ (ఎల్పీజీ) గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, అక్రమ రవాణాపై పౌరసరఫరాల శాఖ ఉక్కుపాదం మోపుతోంది. గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఈ దాడులు గ్యాస్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది. గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే లక్ష్యంతో అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
గడిచిన నెల రోజుల్లో విజిలెన్స్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడులలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమంగా నిల్వ ఉంచిన, రవాణా చేస్తున్న 5,079 డొమెస్టిక్ సిలిండర్లను, అలాగే 70 చిన్న సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఈ మొత్తం సిలిండర్ల విలువ సుమారు రూ.1.50 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 2,089 కేసులు నమోదు చేసి, నిందితులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకున్నారు. నిబంధనల ప్రకారం గ్యాస్ డెలివరీ సకాలంలో జరుగుతుందో లేదో తెలుసుకోవడానికి 'కమాండ్ కంట్రోల్' ద్వారా ఏజెన్సీల బుకింగ్స్, డెలివరీ వివరాలను ప్రతిరోజూ తనిఖీ చేస్తున్నారు. డొమెస్టిక్ సిలిండర్లను పక్కదారి పట్టించే వారిపై నిఘా పెట్టడమే కాకుండా, విజిలెన్స్ బృందాలు నిరంతరం తనిఖీలు చేస్తున్నాయి.
ప్రజలకు విజ్ఞప్తి
గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ, అక్రమ రవాణా లేదా డెలివరీలో జాప్యం వంటి సమస్యలు ఎదురైతే ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1967 కు కాల్ చేసి సమాచారం అందించాలని అధికారులు కోరారు. వినియోగదారుల హక్కులను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని, అక్రమాలకు పాల్పడే ఏజెన్సీలపై లైసెన్సుల రద్దు వంటి కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.
