
ఎల్పీజీ అంశంపై రాహుల్ వ్యాఖ్యలకు గిరిరాజ్ సింగ్ కౌంటర్
దేశంలో ఎల్పీజీ అందుబాటుపై తప్పుడు సమాచారం, గందరగోళం సృష్టిస్తున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ శుక్రవారం లోక్ సభలో ఆరోపణలు చేశారు.
కోవిడ్-19 సమయంలో కూడా రాహుల్ గాంధీ ఇలాంటి ప్రవర్తన చేశారని, అయితే ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొందని ఆయన పార్లమెంట్ భవన సముదాయంలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
అంతకు ముందు గురువారం లోక్‌సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, భారత్ విదేశాంగ విధానం లోపభూయిష్టంగా ఉండటంతో దేశం యొక్క శక్తి భద్రత “కాంప్రమైజ్” అయిందని, వివిధ చమురు సరఫరాదారులతో సంబంధాల విషయంలో అమెరికాకు నిర్ణయాధికారం ఇచ్చినట్లుగా ప్రభుత్వం అధికారాలు “బదిలీ” చేసిందని ఆరోపించారు. అంతేకాదు ఎల్పీజీ అంశంపై చర్చ సందర్భంగా ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను కూడా రాహుల్ లోక్ సభలో ప్రస్తావించారు.
అలాగే అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య యుద్ధం భారత్ పై దీర్ఘకాలిక ప్రభావాలు చూపుతుందని రాహుల్ గాంధీ లోక్‌సభలో పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలను విమర్శిస్తూ, గిరిరాజ్ సింగ్ “దేశాన్ని దూషించడమే రాహుల్ గాంధీకి తెలిసిన పని. కోవిడ్ వచ్చినప్పుడు కూడా దేశవ్యాప్తంగా గందరగోళం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారు” అని అన్నారు.
“కొన్ని సందర్భాల్లో పిల్లలకు టీకాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మరోసారి వేరే వాదనలు చేశారు. ఆయన ఎప్పుడూ గందరగోళమే సృష్టించారు” అని మంత్రి విమర్శించారు. అయితే, ప్రధాని టీకా కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవ చేశారని, విదేశాంగ విధానంలో భాగంగా అనేక దేశాలకు టీకాలు సరఫరా చేసి ‘వసుధైక కుటుంబకం’ భావనను ప్రతిబింబించారని ఆయన అన్నారు.
ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ ఎల్పీజీ అందుబాటుపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని గిరిరాజ్ ఆరోపించారు.
రాహుల్ గాంధీ లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఉండటానికి కూడా అర్హుడు కాదని బెగుసరాయ్ ఎంపీ పేర్కొన్నారు. “రాహుల్ గాంధీ పాత్ర ఒక అర్బన్ నక్సల్‌లా ప్రవర్తించడానికే పరిమితమైంది. ప్రతిపక్ష నేతగా ఉండాల్సిన గంభీరత ఆయనకు లేదు” అని ఆయన వ్యాఖ్యానించారు.
“రాహుల్ ఇంకా తాను రాజకుమారుడిననే భావనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నకిలీ గాంధీ కుటుంబానికి బానిసగా మారడం దురదృష్టకరం” అని ఆయన అన్నారు.
మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణ కారణంగా భారత్‌లో ఎల్పీజీ సంక్షోభం ఏర్పడిందని, ప్రజలు సిలిండర్లు కొనడానికి గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వస్తోందని సమాచారం మా దగ్గర ఉంది. ఇరాన్–ఒమన్ మధ్య ఉన్న హోర్ముజ్ జలసంధి మూసివేయబడటంతో ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. ఈ మార్గం ద్వారా భారత్‌కు 5.8 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురులో సగానికి పైగా, వంట గ్యాస్‌లో 55 శాతం, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)లో 30 శాతం సరఫరా అవుతుండేది అన్నారు.
ప్రస్తుత పరిస్థితిని అంచనవేస్తూ చమురు కంపెనీలు గృహ వినియోగానికి సరఫరాను ప్రాధాన్యం ఇస్తూ, హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య వినియోగదారులకు సరఫరాను తగ్గించాయని అన్నారు.
మరోవైపు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కూడా అభ్యంతరం తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, గ్యాస్ ఉత్పత్తిని కూడా పెంచమని కంపెనీలను ఆదేశించినట్లు వెల్లడించారు. గ్యాస్ బ్లాక్ మార్కెట్‌లోకి వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. అంతేకాదు పీడీఎస్ కింద కిరసనాయిల్ అందుబాటులో ఉంచినట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు.
