Let's talk: editor@tmv.in
‘ఎల్‌‌నినో’ సవాళ్లపై తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళిక: డిప్యూటీ సీఎం భట్టి

‘ఎల్‌‌నినో’ సవాళ్లపై తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళిక: డిప్యూటీ సీఎం భట్టి

Gaddamidi Naveen
22 జులై, 2026

ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఎల్‌‌నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం దూరదృష్టితో పక్కా ప్రణాళికలు రూపొందిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన "పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల నుంచి తెలంగాణ సంసిద్ధత వరకు" అనే అవగాహన సదస్సుకు ఆయన రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌తో కలసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ఉష్ణోగ్రతల మార్పుల వల్ల రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఎదురైనా రైతులు నష్టపోకుండా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. తాగునీరు, సాగునీటితో పాటు పశుపక్ష్యాదుల నీటి, ఆహార అవసరాలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గ్రామీణ స్థాయి వరకు ప్రజల్లో ఈ అంశంపై పూర్తి చైతన్యం తీసుకురావడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు.

భూమధ్యరేఖ సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల మార్పులు తెలంగాణలో వర్షపాతం, చెరువులు, వాగులు, భూగర్భ జలాలపై చూపే ప్రభావాన్ని శాస్త్రవేత్తలతో విశ్లేషించి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ సమాచారాన్ని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ చేరవేయడంలో టెలివిజన్ ఛానెళ్లు సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తున్నాయని అభినందించారు. ఎల్‌‌నినో ప్రభావంతో పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల వర్షాకాలంలోనూ ఏప్రిల్ నాటి వేసవి గరిష్ట స్థాయికి విద్యుత్ డిమాండ్ చేరుకుందని తెలిపారు.

విద్యుత్ రంగంలోనూ ప్రభుత్వం స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ అమలు చేస్తోందని భట్టి విక్రమార్క చెప్పారు. పగటి సమయంలో అందుబాటులో ఉండే సౌర విద్యుత్‌ను గరిష్టంగా వినియోగించడం ద్వారా విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గించడంతో పాటు ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని కూడా నియంత్రిస్తున్నామని వివరించారు. అవసరానికి అనుగుణంగా థర్మల్ విద్యుత్ వినియోగాన్ని సమన్వయం చేయడం ద్వారా గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడుతున్నట్లు తెలిపారు.

ఎల్‌‌నినో ప్రభావంతో ఈ వర్షాకాలంలోనూ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ వేసవి స్థాయికి చేరుకుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఫ్యాన్లు, ఏసీలు, బోర్‌వెల్లు, లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ల వినియోగం పెరగడంతో విద్యుత్ అవసరం గణనీయంగా పెరిగిందన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్ ప్రణాళికలను రూపొందించడంలో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు. ఇలాంటి అవగాహన సదస్సులను జిల్లాల వారీగా కూడా నిర్వహించి ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు.