Let's talk: editor@tmv.in
ఎల్‌నినో ప్రభావం తీవ్రం.. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి: రైతులకు ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి

ఎల్‌నినో ప్రభావం తీవ్రం.. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి: రైతులకు ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి

Gaddamidi Naveen
25 జులై, 2026

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ద్వితీయార్ధంలో (ఆగస్ట్ తర్వాత) వర్షపాతం మరింత క్షీణించే ప్రమాదం ఉన్నందున, రైతులు వరి వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఎల్‌నినో ప్రభావం, తీవ్ర వర్షాభావ పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు. సమావేశం అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కె. పార్థసారథి కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే 51 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. ఆగస్ట్ తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని చెప్పారు. వరి పంట వేసి, ఆ తర్వాత నీళ్లు లేక ఇబ్బంది పడటం కంటే ముందే రైతులు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎల్‌నినో ప్రభావం వల్ల భూగర్భ జలాలు కూడా వేగంగా పడిపోతున్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో రైతులు కొత్తగా బోర్‌వెల్స్ వేయవద్దని కోరుతున్నాం. ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా రైతులకు ముందే మార్గదర్శకాలు జారీ చేస్తున్నామ‌ని మంత్రి స్పష్టం చేశారు.

సాధారణంగా ఈపాటికే గోదావరి నదిలోని పోలవరం వద్ద లక్ష క్యూసెక్కుల మేర వరద నీటి ప్రవాహం ఉండాలని, కానీ ప్రస్తుతం కేవలం 38,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో మాత్రమే ఉందన్నారు. గోదావరి, కృష్ణా డెల్టాల్లో ఇప్పటికే 70 శాతం ఖరీఫ్ నాట్లు పూర్తయ్యాయని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయం 59 శాతం నీటిపారుదలపై, 41 శాతం వర్షాధారంగా ఉందన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా ప్రోత్సహించడానికి వ్యవసాయ శాఖ ద్వారా ఉచితంగా వివిధ రకాల విత్తన కిట్లను పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పంటల కంటే తాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని చెప్పారు.