
ఎల్‌నినో ప్రభావంపై తెలంగాణ కేబినెట్ ఆందోళన.. ధరణి అక్రమాలపై సిట్ విచారణకు ఆదేశాలు
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన 36వ రాష్ట్ర మంత్రిమండలి (కేబినెట్) సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడం, చాలా ప్రాంతాల్లో 30 నుంచి 35 శాతానికి మించి వర్షపాతం లేకపోవడంతో పరిస్థితిని అత్యంత పరిగణించిన మంత్రివర్గం, దీనిపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికతో లేఖ రాయాలని నిర్ణయించింది.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, సాగునీరు, విద్యుత్ రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తాగునీటి సమస్యలు రాకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఆదేశించింది. అలాగే విద్యుత్ కోతలు లేకుండా నిరంతర సరఫరా కొనసాగించేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది. ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా ప్రజాభవన్‌లో ప్రత్యేక టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ హెల్ప్‌లైన్ ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. రైతులు, ప్రజలు తమ సమస్యలను 1-800-123-7157 నంబర్‌కు తెలియజేయవచ్చని పేర్కొంది.
వర్షాభావ పరిస్థితులపై పూర్తి వివరాలతో కేంద్ర ప్రభుత్వానికి నివేదించి, నష్టాన్ని అంచనా వేయడానికి ప్రత్యేక బృందాన్ని పంపించాలని కోరాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసింది. ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతగా వినియోగించాలని నిర్ణయించగా, రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులపై అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించిన మంత్రివర్గం, ఈ నెల 20న ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌చార్జి మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించింది. జిల్లా వారీగా నష్టం, పరిస్థితులపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని సూచించింది. రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి నేతృత్వంలో ఎల్‌నినో ప్రభావంపై వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రత్యేక అధ్యయన నివేదిక రూపొందించాలని కూడా నిర్ణయించింది.
ధరణి పోర్టల్ అక్రమాలపై 'సిట్' విచారణ
ఇదే సమావేశంలో గత ప్రభుత్వ హయాంలో భూముల రికార్డులు, క్రయవిక్రయాల్లో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణకు ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. 2020 అక్టోబర్ 29న ధరణి అమల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు జరిగిన టెండర్ ప్రక్రియ, భూముల రిజిస్ట్రేషన్లు, అసైన్డ్, ప్రభుత్వ భూముల బదలాయింపులు సహా అన్ని అనుమానాస్పద లావాదేవీలపై లోతైన విచారణ జరిపించనున్నారు.
ఇతర కీలక చట్ట సవరణలు
అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లను కో-ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేసేందుకు తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం–2019 సవరణకు ఆమోదం తెలిపింది. గ్రామ పంచాయతీ నిధులను జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో జమ చేసుకునేలా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018 సవరణ బిల్లుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమావేశ నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
