
ఎల్డీఎఫ్ మోడీకి ‘బీ టీమ్’: ప్రియాంకా గాంధీ
కేరళంలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ప్రధాని నరేంద్రమోడీకి ‘బీ టీమ్’లా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలో కొనసాగాలనే ఆశతో ఎల్డీఎఫ్ బీజేపీతో రహస్యంగా చేతులు కలిపిందని ఆమె ఆరోపించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రచారంలో భాగంగా తిరువనంతపురం సమీపంలోని పుతంతొపు ప్రాంతంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. అనంతరం కొల్లం, కౌడియార్ ప్రాంతాల్లో జరిగిన సభల్లో కూడా ఇదే ఆరోపణలను ఆమె పునరుద్ఘాటించారు. పశ్చిమ ఆసియా సంక్షోభం విషయంలో ప్రధాని మోడీ అమెరికా, ఇజ్రాయెల్ ముందు తలవంచారని ఆమె ఆరోపించారు. ఆ కారణంగా భారత్ కూడా ఇతర దేశాల్లాగే ప్రభావాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. మన ప్రధానికి ధైర్యం లేదు. దేశ ప్రయోజనాల కోసం నిలబడే తత్వం లేదు. అందుకే భారత్ నష్టపోతోందని విమర్శించారు. గల్ఫ్ ప్రాంతంలో జరుగుతున్న సంక్షోభ సమయంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల భద్రత విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆమె అన్నారు.
ఇక కేరళం ముఖ్యమంత్రి విజయన్‌పై కూడా ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే నేతలపై సాధారణంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలు కేసులు పెడతాయని ఆమె పేర్కొన్నారు. కానీ విజయన్‌పై అలాంటి కేసులు లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. మోడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నానని విజయన్ చెబుతుంటే నాకు నవ్వు వస్తోంది. ఆయనపై కేంద్ర సంస్థల కేసులేవీ లేవు. అంటే ఆయన కూడా రాజీ పడినట్టే అని ఆమె వ్యాఖ్యానించారు.
కేరళంలో మార్పు అవసరం
శబరిమల ఆలయంలో బంగారం దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రధాని ఎందుకు మౌనం పాటిస్తున్నారని కూడా ఆమె ప్రశ్నించారు. బీజేపీ, ఎల్డీఎఫ్ రెండూ కార్పొరేట్ ప్రయోజనాల కోసం పనిచేసే అవినీతి పార్టీలేనని ఆమె ఆరోపించారు. ఈ రెండు పార్టీలూ చాలా కాలంగా అధికారంలో ఉన్నాయని, ఇప్పుడు మార్పు అవసరమని అన్నారు. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని, ఆరోగ్య వ్యవస్థ క్రమంగా దెబ్బతింటోందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది, వైద్య పరికరాలు, మందుల కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.
ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మేనిఫెస్టోలో ఉన్న ‘ఇందిరా హామీలు’ గురించి కూడా ఆమె వివరించారు. రాష్ట్ర రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, సంక్షేమ పెన్షన్‌ను నెలకు రూ.3,000కు పెంపు, కాలేజీ చదివే బాలికలకు నెలకు రూ.1,000 సహాయం వంటి హామీలను అమలు చేస్తామని చెప్పారు. అదే విధంగా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల బీమా పథకం, చిన్న వ్యాపారాలకు రూ.5 లక్షల వడ్డీ లేని రుణాలు, వృద్ధుల కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఇప్పుడైనా మార్పు తీసుకురాకపోతే మరో ఐదేళ్లు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోండని ఆమె ఓటర్లను కోరారు. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీకి ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి.
