
ఎల్డీఎఫ్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
కేరళంలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూటమి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను గురువారం విడుదల చేసింది. పేదరిక నిర్మూలన, సంక్షేమ పెన్షన్‌ను నెలకు రూ.3,000కు పెంపు, ఉద్యోగావకాశాల పెంపు, భారీ పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలను ప్రధాన హామీలుగా ప్రకటించింది. పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం ముఖ్యమంత్రి విజయన్ మాట్లాడుతూ సామాజిక న్యాయం, ఆర్థికాభివృద్ధిని కలిపి కేరళంను జ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో తీవ్రమైన పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించామని ప్రభుత్వం ప్రకటించిన విషయం గుర్తు చేశారు. ప్రస్తుతం మేనిఫెస్టోలో సుమారు ఐదు లక్షల అత్యంత పేద కుటుంబాలను గుర్తించి ప్రత్యేక సహాయంతో పేదరికం నుంచి బయటకు తీసుకువస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా షెడ్యూల్డ్ కాస్ట్‌లు, మత్స్యకారులు, వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. వృద్ధులు, మంచానికే పరిమితమైన రోగులకు మెరుగైన సంరక్షణ అందించేందుకు స్థానిక స్థాయిలో ఆరోగ్య సేవలను బలోపేతం చేస్తామని తెలిపారు. చదువు పూర్తి చేసిన విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్ అవకాశాలు కల్పించడమే కాకుండా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను విస్తరిస్తామని ప్రకటించింది. ‘బ్యాక్ టు క్యాంపస్’ అనే కార్యక్రమం ద్వారా ఉద్యోగార్థులకు ప్రాక్టికల్ స్కిల్స్ అందించనున్నారు.
మహిళలకు అవకాశాలు
మహిళల ఉపాధిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని ఎల్డీఎఫ్ తెలిపింది. రాష్ట్రంలో మహిళల పని భాగస్వామ్యాన్ని 50 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో నెలసరి సెలవు (మెన్స్ట్రువల్ లీవ్) అమలు చేయాలని ప్రతిపాదించింది. మహిళలపై హింసను అరికట్టేందుకు స్థానిక స్థాయిలో ప్రత్యేక చర్యలు, బలమైన న్యాయ సహాయ వ్యవస్థలు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ట్రాన్స్‌జెండర్ సమాజానికి కూడా మరింత మద్దతు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో లింగ సమానత్వాన్ని అమలు చేస్తామని తెలిపింది. వచ్చే ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా కొత్త ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం
ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తామని ఎల్డీఎఫ్ తెలిపింది. ఇటీవలి సంవత్సరాల్లో వాటి టర్నోవర్ రెట్టింపు అయినట్లు పేర్కొంటూ, 2031 నాటికి వాటి టర్నోవర్‌ను రూ.10,000 కోట్లకు పెంచి అన్ని సంస్థలను లాభదాయకంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. పర్యాటక రంగాన్ని రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తూ 2031 నాటికి 5 కోట్ల దేశీయ పర్యాటకులు, 15 లక్షల విదేశీ పర్యాటకులను ఆకర్షించాలనే లక్ష్యాన్ని ప్రకటించింది. ఒక లక్ష సూక్ష్మ సంస్థలను రూ.1 కోట్ల వ్యాపారాలుగా అభివృద్ధి చేయడం, వెయ్యి చిన్న కంపెనీలను రూ.100 కోట్ల స్థాయికి తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకుంది. వరి, కొబ్బరి, రబ్బర్ పంటలకు మద్దతు ధరలను పెంచడమే కాకుండా స్థానిక మార్కెట్లను బలోపేతం చేయనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా స్మార్ట్ రోడ్లు, మెరుగైన రైలు, మెట్రో కనెక్టివిటీ, జల రవాణా విస్తరణ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కొచి మెట్రో విస్తరణతో పాటు విమానాశ్రయాలు, పోర్టుల అభివృద్ధి కూడా చేపడతామని తెలిపారు. మేనిఫెస్టోలో మొత్తం 950 ప్రతిపాదనలు ఉన్నాయని, ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వాటిని 60 ప్రధాన అంశాలుగా సమగ్రంగా రూపొందించామని ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు.
