Let's talk: editor@tmv.in
ఎల్‌డిఎఫ్‌కు వేసే ఓటు.. ఢిల్లీలో మోడీకి చేరినట్లే: సీఎం రేవంత్ రెడ్డి

ఎల్‌డిఎఫ్‌కు వేసే ఓటు.. ఢిల్లీలో మోడీకి చేరినట్లే: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
2 ఏప్రిల్, 2026

కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. నెమమ్ నియోజకవర్గంలోని యుడిఎఫ్ అభ్యర్థి కేఎస్ శబరీనాథన్ తరపున ప్రచారం చేస్తూ, కేరళ భవిష్యత్తు కోసం ఓటర్లు విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.

కేరళ ప్రజలు ఎంతో మేధావులు, విద్యావంతులు. మీరు ఇక్కడ ఎల్‌డిఎఫ్ లేదా పినరయి విజయన్‌కు ఓటు వేస్తే, ఆ ఓటు అంతిమంగా ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోడీకి లబ్ధి చేకూరుస్తుంది. కేరళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మీరు ఆలోచించాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉద్యోగ కల్పన కేవలం యుడిఎఫ్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. కేరళ అభివృద్ధికి అండగా నిలిచేందుకే తాను ఇక్కడికి వచ్చానని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ ద్వంద్వ నీతి.. బీజేపీ

కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్‌డిఎఫ్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్నాయి. ఒక రాష్ట్రంలో దోస్తీ చేస్తూ, మరో రాష్ట్రంలో కుస్తీ పట్టడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతికి నిదర్శనమని బీజేపీ, మిత్రపక్షమైన సీపీఐ నేతలు మండిపడ్డారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు. తెలంగాణలో దోస్తీ - కేరళలో కుస్తీ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని, కేరళలో మాత్రం వారికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం కాంగ్రెస్ కపట నీతికి పరాకాష్ట అని ఆయన విమర్శించారు. ఇలాంటి విచిత్రమైన రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్ నేతలు ఆరితేరారని ఆయన ధ్వజమెత్తారు.

సీపీఐ అభ్యంతరం

మరోవైపు, తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై వ్యక్తిగత దాడులు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ కలిసి ఉన్నాయి. దేశవ్యాప్తంగా 'ఇండియా' కూటమిలో కూడా మేము భాగస్వాములమే. మన ప్రధాన శత్రువు బీజేపీ సిద్ధాంతం. కమ్యూనిస్టులపై దాడి చేయడం వల్ల ఎవరికి లాభం కలుగుతుందో రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలని కూనంనేని పేర్కొన్నారు. పాలనలో లోపాలను ఎత్తిచూపడంలో తప్పులేదని, కానీ వామపక్షాలనే టార్గెట్ చేయడం కూటమి ధర్మానికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి పర్యటన ఇరు పార్టీల మధ్య చిచ్చు పెట్టినట్లయింది.

కేరళలో ఏప్రిల్ 9న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. 1982 నుంచి కేరళలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్ ప్రభుత్వాలు మారుతూ వచ్చేవి. అయితే, 2021లో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి ఆ సంప్రదాయాన్ని బద్దలు కొట్టింది. ఈసారి ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని యుడిఎఫ్ భావిస్తుండగా, తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ కూడా సత్తా చాటాలని చూస్తోంది.