Let's talk: editor@tmv.in
ఎలాన్ మస్క్ ఏఐ ‘గ్రోక్’పై మలేషియా, ఇండోనేషియా నిషేధం

ఎలాన్ మస్క్ ఏఐ ‘గ్రోక్’పై మలేషియా, ఇండోనేషియా నిషేధం

Shaik Mohammad Shaffee
13 జనవరి, 2026

సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తోందో, అంతకంటే వేగంగా దుర్వినియోగం అవుతోంది. తాజాగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ‘గ్రోక్’ ఏఐ చాట్‌బాట్‌పై ఆగ్నేయాసియా దేశాలైన మలేషియా, ఇండోనేషియాలు ఉక్కుపాదం మోపాయి. కృత్రిమ మేధను ఉపయోగించి మహిళలు, చిన్నారులకు సంబంధించిన అసభ్యకరమైన, మార్ఫింగ్ చేసిన చిత్రాలను (డీప్‌ఫేక్‌లు) సృష్టిస్తున్నారన్న ఆరోపణలతో ఈ టూల్‌ను ఆయా దేశాల్లో బ్లాక్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ దుర్వినియోగంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఒక ఏఐ చాట్‌బాట్‌పై నిషేధం విధించిన మొదటి దేశాలుగా ఇవి నిలిచాయి.

హక్కుల ఉల్లంఘనే.. ఇండోనేషియా సీరియస్

మహిళల గౌరవానికి భంగం కలిగించేలా, వారి అనుమతి లేకుండా అశ్లీల చిత్రాలను సృష్టించడం ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘనే అని ఇండోనేషియా ప్రభుత్వం స్పష్టం చేసింది. "డిజిటల్ ప్రపంచంలో పౌరుల భద్రత, గౌరవం మాకు ముఖ్యం. ఏఐ ద్వారా సృష్టిస్తున్న డీప్‌ఫేక్‌లు తీవ్రమైన నేరం" అని ఇండోనేషియా కమ్యూనికేషన్స్, డిజిటల్ వ్యవహారాల మంత్రి మెయుటియా హఫీద్ తెలిపారు. గ్రోక్ ఏఐలో సరైన భద్రతా ప్రమాణాలు లేవని, దీనివల్ల ఇండోనేషియా పౌరుల ఫోటోలను అశ్లీల చిత్రాలుగా మార్చడం సులభమవుతోందని ఆ దేశ డిజిటల్ పర్యవేక్షణ విభాగం డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ సబార్ ఆందోళన వ్యక్తం చేశారు.

మలేషియాలోనూ అదే దారి..

మలేషియా కమ్యూనికేషన్స్ అండ్ మల్టీమీడియా కమిషన్ సైతం ఆదివారం గ్రోక్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఎక్స్ (ట్విటర్) వేదికగా అందుబాటులో ఉన్న ఈ చాట్‌బాట్‌ను ఉపయోగించి అసభ్యకరమైన కంటెంట్‌ను రూపొందిస్తున్నారని, ఇది మలేషియా చట్టాల ప్రకారం నేరమని కమిషన్ పేర్కొంది. భద్రతా చర్యలు పెంచాలని ఎక్స్ సంస్థకు నోటీసులు ఇచ్చినా, వారు కేవలం 'యూజర్ రిపోర్టింగ్' (యూజర్లు ఫిర్యాదు చేస్తే తొలగిస్తాం) అనే పద్ధతిపైనే ఆధారపడుతున్నారని, అది సరిపోదని మలేషియా అభిప్రాయపడింది.

వివాదాస్పద ‘స్పైసీ మోడ్’

2023లో ప్రారంభమైన గ్రోక్, గత ఏడాది 'గ్రోక్ ఇమేజిన్' పేరుతో ఫోటోలను సృష్టించే ఫీచర్‌ను తెచ్చింది. ఇందులో ఉన్న ‘స్పైసీ మోడ్’ ద్వారా అడల్ట్ కంటెంట్‌ను కూడా సృష్టించే వీలుండటం తీవ్ర చర్చకు దారితీసింది. బికినీల్లో మహిళల ఫోటోలు, చిన్నారుల మార్ఫింగ్ చిత్రాలు వంటివి ఈ ఏఐ ద్వారా సృష్టించబడుతున్నాయని బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. తాజా ఆందోళనల నేపథ్యంలో కేవలం డబ్బులు చెల్లించే వారికి మాత్రమే ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను పరిమితం చేస్తున్నట్లు ఎక్స్ ప్రకటించింది. అయితే ఈ చర్య సరిపోదని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

భారత్ చర్యలు

భారత్ సైతం గ్రోక్ ఏఐ ద్వారా వెలువడే డీప్‌ఫేక్‌లపై తీవ్రంగా స్పందించింది. ఐటీ చట్టాల ప్రకారం అశ్లీల కంటెంట్‌ను నియంత్రించాలంటూ కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఎక్స్‌కు నోటీసులు జారీ చేసింది. దీనికి స్పందించిన ఎక్స్ సంస్థ, సుమారు 3,500 అసభ్యకర పోస్ట్‌లను తొలగించి, 600 పైగా ఖాతాలను రద్దు చేసింది. మలేషియా వలె పూర్తిగా నిషేధించకపోయినా, నిబంధనలు పాటించకుంటే 'సేఫ్ హార్బర్' రక్షణను తొలగిస్తామని భారత్ గట్టిగా హెచ్చరించింది.

ప్రపంచ దేశాల నిశిత పరిశీలన

కేవలం మలేషియా, ఇండోనేషియాలే కాకుండా.. యూరోపియన్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా గ్రోక్ ఏఐ పనితీరుపై కన్నేశాయి. డీప్‌ఫేక్‌ల సృష్టిని అరికట్టేందుకు పటిష్టమైన సాంకేతిక రక్షణ కవచాలు లేకపోతే, మరిన్ని దేశాలు ఈ బాటలోనే నడిచే అవకాశం కనిపిస్తోంది.