
ఎలాంటి టెస్టుకైనా సిద్ధం: కేటీఆర్
కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన విమర్శలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. డ్రగ్స్ విషయంలో తన వైఖరిని స్పష్టం చేస్తూనే, ప్రతి రాజకీయ వివాదంలోకి తన పేరును లాగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాదకద్రవ్యాల వాడకం మనిషిని రాక్షసుడిగా మారుస్తుందని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు కూడా వీటికి బానిసవ్వడం దురదృష్టకరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నేను వ్యక్తిగతంగా డ్రగ్స్, అక్రమ పదార్థాల వాడకానికి పూర్తిగా వ్యతిరేకం. డ్రగ్స్ వాడటం లేదా సరఫరా చేయడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా.. వారు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా సరే చట్టప్రకారం కఠినంగా శిక్షించాల్సిందే అని ఆయన తన ఎక్స్ వేదికగా వేల్లడించారు.
అయితే ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రతీకార చర్యలు తీసుకోవడం బాధాకరమని కేటీఆర్ విమర్శించారు. డ్రగ్స్ కేసును ఉపయోగించి బీఆర్‌ఎస్‌పై దుష్ప్రచారం చేయడం అసహ్యకరమైన రాజకీయాలకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక ప్రజాప్రతినిధులందరికీ డ్రగ్ టెస్టులు నిర్వహించాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించిన విషయంపై కూడా కేటీఆర్ స్పందించారు. నేను ఏ పరీక్షకైనా సిద్ధమని ఇప్పటికే పలుమార్లు చెప్పాను. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు డ్రగ్ టెస్టులు చేయించుకోవాలన్న సూచనను స్వాగతిస్తున్నా.ప్రజలకు మనమే ఆదర్శంగా నిలుద్దాం, రండి అని ఆయన ప్రతిసవాల్ విసిరారు.
అయితే, ప్రతి డ్రగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీని, తన పేరును అనవసరంగా లాగడంపై కేటీఆర్ మండిపడ్డారు.తన పేరును ఇష్టానుసారంగా డ్రగ్స్ వివాదాల్లోకి లాగితే చూస్తూ ఊరుకోబోనని, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.
