Let's talk: editor@tmv.in
ఎల్​టీటీఈ పునరుద్ధరణకు యత్నం

ఎల్​టీటీఈ పునరుద్ధరణకు యత్నం

Pinjari Chand
22 సెప్టెంబర్, 2025

శ్రీలంకలో లిబరేషన్​ టైగర్స్​ ఆఫ్​ తమిళ్​ ఈలం (ఎల్టీటీఈ)ని మళ్లీ స్థాపించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నట్లు భారత ఈడీ అధికారులు గుర్తించారు. ఆ దేశానికి చెందిన పౌరురాలు వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉండడం, నాడు తమిళ్​ ఈలంలో యాక్టివ్​ గా ఉన్న వారికి ఇక్కడి నుంచి చెల్లింపులు చేయడానికి ప్రయత్నించడంతో మళ్లీ తమిళ్ ఈలం పురుడు పోయడానికి వనరులను కూడగడుతున్నట్లు అధికారులు విచారణలో తేల్చారు.

2019లో టూరిస్ట్​ వీసాపై ఇండియాకు వచ్చిన శ్రీలంక పౌరురాలైన లెచ్చుమనన్​ మేరీ ఫ్రాన్సిస్కా గడువు ముగిసినా నకిలీ పత్రాలతో పాస్​పోర్ట్​ తీసుకుని ఇక్కడే గడిపింది. 2021 అక్టోబర్​ లో పాస్​ పోర్టుతో చెన్నై నుంచి శ్రీలంకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. పుళల్ సెంట్రల్ జైలులో రిమాండ్​లో ఉన్న ఆమెపై నకిలీ పాస్​పోర్ట్​ కేసును ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఆ సమయంలో కీలక విషయాలు ఆమె నుంచి రాబట్టారు. ఎల్టీటీటీఈ పునరుద్ధరణకు తాను ఇక్కడ ప్రయత్నాలు చేసినట్లు, అందుకు ఆమె యాక్టివ్‌గా లేని బ్యాంక్​ ఖాతాల యాక్సెస్​ కోసం ప్రయత్నించినట్లు, క్యాడర్ నియామకానికి కుట్రలు చేసినట్లు గుర్తించారు. దీంతో ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా టీ కెన్నిస్టన్​ ఫెర్నాండోతో సహా ఏడుగురిని అరెస్ట్​ చేశారు. విచారణలో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం వెలుగులోకి రావడంతో కేసును ఎన్​ఐఏకు బదిలీ చేశారు.

రూ.42 కోట్లు మళ్లించేందుకు యత్నం

డెన్మార్క్​లో స్థిరపడిన శ్రీలంక తమిళుడు, ఎల్టీటీఈ మాజీ కార్యకర్త ఉమాకాంతన్​‌తో నిరంతరం ఈ యువతి సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఉమాకాంతన్​ సూచనలతో మేరీ ఫ్రాన్సిస్కా ఇక్కడి ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంక్ నుంచి సుమారు రూ.42 కోట్లను మళ్లించేందుకు ప్రయత్నించినట్లు ఎన్​ఐఏ తేల్చింది. పునరుద్ధరణలో భాగంగా క్యాడర్​ కు చెల్లింపులు చేసినట్టు గుర్తించారు. అయితే తాజాగా ఆమెను మళ్లీ విచారించడానికి ఎన్​ఐఏ కోర్టును అనుమతి కోరింది. ఇదో విచిత్రమైన కేసుగా పరిగణిస్తూ విచారణకు పోలీసులకు అనుమతినిచ్చింది. దీంతో ఆమెను రెండు రోజుల పాటు ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబట్టనున్నారు.

ఎల్​టీటీఈ పునరుద్ధరణకు యత్నం - Tholi Paluku