
ఎలక్ట్రిక్ వ్యవసాయ ట్రాక్టర్లకు కొత్త నాణ్యతా ప్రమాణాలు
భారత వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. పొలాల్లో వాడే ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల పనితీరు, భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 'ఐఎస్ 19262: 2025' (ఎలక్ట్రిక్ అగ్రికల్చర్ ట్రాక్టర్స్- టెస్ట్ కోడ్) పేరుతో కొత్త ప్రమాణాలను విడుదల చేసింది. ఆదివారం ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన 'జాతీయ వినియోగదారుల దినోత్సవం' సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ కొత్త నిబంధనలను ఆవిష్కరించారు.
ఏమిటీ కొత్త ప్రమాణాలు?
ఇప్పటివరకు డీజిల్ ట్రాక్టర్లకు మాత్రమే స్పష్టమైన నిబంధనలు ఉండగా, ఇప్పుడు ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల కోసం ప్రత్యేకంగా వీటిని రూపొందించారు. దీనిని 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్' (బీఐఎస్) తయారు చేసింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల బ్యాటరీ సామర్థ్యం, లాగే శక్తి, విడిభాగాల నాణ్యత, ఇతర ముఖ్యమైన విభాగాలను కఠినంగా పరీక్షిస్తారు. దీనివల్ల రైతులకు నాణ్యమైన, నమ్మకమైన ట్రాక్టర్లు అందుబాటులోకి వస్తాయి.
రైతులకు కలిగే లాభాలేంటి?
ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు వాడటం వల్ల రైతులకు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణ డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే వీటిలో ఇంధన ఖర్చు పూర్తిగా తప్పుతుంది కాబట్టి సాగు వ్యయం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా, డీజిల్ ఇంజన్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ మోటార్లలో కదిలే విడిభాగాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల రిపేర్లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది, నిర్వహణ ఖర్చులు కూడా రైతుకు భారంగా అనిపించవు.
పర్యావరణం, ఆరోగ్యం పరంగా కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఈ ట్రాక్టర్లు పొగను విడుదల చేయవు కాబట్టి పొలంలో గాలి స్వచ్ఛంగా ఉంటుంది, అలాగే వీటి శబ్దం చాలా తక్కువగా ఉండటం వల్ల రైతులకు ప్రశాంతమైన పని వాతావరణం దొరుకుతుంది. డీజిల్ వినియోగం తగ్గడం వల్ల గాలి కాలుష్యం తగ్గి పర్యావరణం కూడా సురక్షితంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పనితీరును అందించే ఇవి భవిష్యత్తు వ్యవసాయానికి ఎంతో కీలకం కానున్నాయి.
నాణ్యతపై రైతులకు భరోసా
గతంలో ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల పనితీరును పరీక్షించడానికి సరైన పద్ధతులు లేవు. ఇప్పుడు బీఐఎస్ తెచ్చిన ఈ కొత్త ప్రమాణాల వల్ల తయారీదారులు విధిగా నాణ్యతను పాటించాల్సి ఉంటుంది. ఫలితంగా రైతులు ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను కొనేటప్పుడు వాటి నాణ్యతపై పూర్తి నమ్మకంతో ఉండవచ్చు. దీనివల్ల వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత మరింత వేగంగా అందుబాటులోకి రానుంది.
ప్రభుత్వ ప్రాధాన్యత
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కోరిక మేరకు ఈ ప్రమాణాలను ప్రాధాన్యత ప్రాతిపదికన తయారు చేశారు. ఇందులో ట్రాక్టర్ల తయారీదారులు, పరిశోధకులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు కలిసి పనిచేశారు. ప్రస్తుతానికి ఈ నిబంధనలు స్వచ్ఛందంగా పాటించాల్సి ఉన్నప్పటికీ, ఇది భవిష్యత్తులో దేశీయ వ్యవసాయ టెక్నాలజీని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
