Let's talk: editor@tmv.in
ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ రికార్డు

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ రికార్డు

Shaik Mohammad Shaffee
24 డిసెంబర్, 2025

భారత ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో టాటా మోటార్స్ మరో కీలక మైలురాయిని దాటింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2.5 లక్షలకు పైగా టాటా ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయని ఆ సంస్థ మంగళవారం ప్రకటించింది. ఇది భారత్‌లో ఈవీ ప్రయాణంలో ఒక పెద్ద ముందడుగుగా కంపెనీ పేర్కొంది.

ఈ విజయంతో దేశంలో వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల మార్కెట్‌లో టాటా మోటార్స్ తన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకుంది. ఒకప్పుడు కొద్దిమంది మాత్రమే ఎలక్ట్రిక్ కార్లను ఎంచుకుంటే, ఇప్పుడు సాధారణ వినియోగదారులు కూడా ఈవీల వైపు మొగ్గు చూపుతున్న సమయంలో ఈ మైలురాయి సాధ్యమైంది.

2020లో టాటా మోటార్స్ తన తొలి మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ కారు నెక్సాన్ ఈవీని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి సంస్థ తన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని క్రమంగా విస్తరించింది. నెక్సాన్ ఈవీ ఒక్కటే ఇప్పటివరకు లక్షకు పైగా అమ్మకాలు సాధించి, భారత్‌లో ఆ ఘనత సాధించిన తొలి ఎలక్ట్రిక్ కారుగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం భారత్‌లో అమ్ముడవుతున్న మొత్తం ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లలో సుమారు 66 శాతం టాటా మోటార్స్ వాటా ఉండటం విశేషం. అంటే రోడ్లపై కనిపించే ప్రతి మూడు ఈవీల్లో రెండూ టాటా కంపెనీకి చెందినవేనని చెప్పవచ్చు.

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో టియాగో ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ వంటి మోడళ్లు ఉన్నాయి. ఇవి వివిధ ధరల పరిధిలో, విభిన్న అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్నాయి. ఫ్లీట్ ఆపరేటర్ల కోసం ప్రత్యేకంగా ఎక్స్‌ప్రెస్-టి ఈవీని కూడా టాటా అందిస్తోంది.

ఈ సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ ఎండీ, సీఈవో శైలేష్ చంద్ర మాట్లాడుతూ, 2.5 లక్షల ఈవీ అమ్మకాలు సాధించడం అంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడు భారతీయుల రోజువారీ జీవితంలో భాగమవుతున్నాయనే స్పష్టమైన సంకేతమని అన్నారు. వినియోగదారులు తమ ఈవీలను ధైర్యంగా నడుపుతూ, ప్రధాన వాహనాలుగా ఉపయోగిస్తున్నారని తెలిపారు.

టాటా ఎలక్ట్రిక్ ప్రయాణం కేవలం కార్లు అమ్మడానికే పరిమితం కాలేదని, దేశాన్ని స్వచ్ఛమైన రవాణా వైపు తీసుకెళ్లే పూర్తి వ్యవస్థను నిర్మించడమే లక్ష్యమని శైలేష్ చంద్ర చెప్పారు. ప్రభుత్వ విధానాలు, సరఫరాదారులు, చార్జింగ్ భాగస్వాములు, వినియోగదారుల సహకారంతో ఈ మార్పు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

ఎలక్ట్రిక్ కార్లు విజయవంతం కావాలంటే చార్జింగ్ సదుపాయం చాలా ముఖ్యమని టాటా మోటార్స్ నమ్ముతోంది. అందుకే, టాటా ఈవీ వాడుతున్న వారికి దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా చార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. వినియోగదారులు తమ ఇళ్లలో, నివసించే కాలనీల్లోనే కాకుండా, బయట ప్రయాణించేటప్పుడు పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో కూడా సులభంగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.

అదే విధంగా, టాటా చార్జింగ్ అగ్రిగేటర్ ద్వారా 20 వేలకుపైగా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమైన హైవేలు, నగర మార్గాల వెంట వేగవంతమైన చార్జింగ్ సదుపాయాలతో 100 మెగా చార్జింగ్ హబ్‌లు ఇప్పటికే పనిచేస్తున్నాయని సంస్థ తెలిపింది. మొత్తానికి, టాటా మోటార్స్ సాధించిన ఈ మైలురాయి భారత్‌లో పెట్రోల్, డీజిల్ కార్ల హవా తగ్గి, ఎలక్ట్రిక్ కార్ల యుగం ఎంత వేగంగా వస్తోందో నిరూపిస్తోంది.

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ రికార్డు - Tholi Paluku